జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నోటీసులు జారీచేసింది. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ప‌వ‌న్‌క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లో పార్టీ శ్రేణుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. భార‌తీయ జ‌న‌తాపార్టీ తెలంగాణ శాఖ త‌మ‌ను ప‌దే ప‌దే అవ‌మానిస్తోంద‌ని, చుల‌క‌న‌గా మాట్లాడుతోంద‌ని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి వాణీదేవికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఒక‌వైపు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా, మ‌రోవైపు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డానికి ఈసీ సీరియ‌స్‌గా తీసుకొని నోటీసులు జారీచేసిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌వ‌న్‌ను విమ‌ర్శించారు.

రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీతో పొత్తు కొనసాగిస్తోన్న పవన్ కల్యాణ్.. జీహెచ్ఎంసీలో పోటీ నుంచి తప్పుకున్నందుకు ప్రతిఫలంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆశించారు. కానీ ఆ స్థానం నుంచి బీజేపీ బరిలోకి దిగేలా, వారికి జనసేన మద్దతు ఇచ్చేలా క‌మ‌ల‌నాథులు ప‌వ‌న్‌ను ఒప్పించగలిగారు. దీనికి సంబంధించి శుక్రవారం ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఆదివారం నాటి జనసేన ఆవిర్భావ దినోత్సవంలో తెలంగాణ బీజేపీని ఉద్దేశించి జనసేనాని తీవ్ర విమర్శలు చేయ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు.

కేంద్ర నాయకత్వంతో, ఏపీలో కలిసి పనిచేస్తున్నా తెలంగాణ రాష్ట్ర శాఖ మాత్రం త‌మ‌ను అవమానిస్తోందని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతిస్తున్నామని పవన్ వ్యాఖ్యానించారు. బీజేపీని విమ‌ర్శించిన‌ కొద్ది గంటలకే పవన్ కు నోటీసులు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ స‌మావేశంలో ప‌వ‌న్ చేసిన  వ్యాఖ్యలతో ఇక బీజేపీతో జనసేన కలిసుండలేదని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరుపార్టీలు విడాకులు తీసుకుంటార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బీజేపీతో మ‌ద్ద‌తు వ‌ద్దంటూ ప‌వ‌న్‌పై ఒత్తిడి తెస్తున్నారు. తిరుప‌తి లోక్‌స‌భకు జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ పోటీచేస్తే మ‌ద్ద‌తివ్వ‌కూడ‌ద‌ని స్థానికంగా ఉండే ఒక సామాజిక‌వ‌ర్గ నాయ‌కులు తీర్మానం కూడా చేశారు. దీనిపై జ‌న‌సేనాని ఎలా స్పందిస్తారో వేచిచూద్దాం!!.




మరింత సమాచారం తెలుసుకోండి: