ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో వారం రోజుల వ్యవధి కూడా లేదు. సాధారణంగా ఇలాంటి సమయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య అనేక అంశాలపై హోరాహోరీ మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ల్యాంట్ టైటిలింగ్ యాక్ట్ ఒక్కటే ఎన్నికల్లో ప్రచారస్త్రంగా మారిపోయింది. అది కూడా వారం రోజుల ముందు నుంచే.


ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక కానీ.. అంతకు ముందు కానీ దీని గురించి ఎక్కడా చర్చ కూడా జరగలేదు. ప్రజల్లో ఎన్నికల మూడ్ రావాలనో.. మరే కారణమో తెలియదు కానీ టీడీపీ, దాని అనుకూల మీడియా దీని గురించి ఒక్కసారిగా హైలెట్ చేయడం ప్రారంభించాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రానున్న రోజుల్లో అతి పెద్ద సంస్కరణ గా మారుతుందని సీఎం జగన్ పదే పదే ప్రస్తావిస్తున్నా. భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులవే అని స్పష్టంగా చెబుతున్నా ప్రతిపక్షాలు పని కట్టుకొని దీనిపై దుష్ర్పచారం చేస్తున్నాయి.


ఈ సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఓ ఆసక్తికర వీడియోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.  చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే దీనిని వాడుకుంటున్నారని విమర్శిస్తూ.. అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడిన వీడియోను బయట పెట్టారు. ఇందులో పయ్యావుల దీని గురించి గొప్పగా మాట్లాడటం కనిపించింది.


పైగా ఈ బిల్లుకి అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు పూర్తి మద్దతు ప్రకటించి.. ఇప్పుడు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇంతకన్నా పచ్చి మోసం మరొకటి ఉండదని దుయ్యబట్టారు. నాడు అసెంబ్లీలో దీని గురించి గొప్పగా మాట్లాడి.. ఇప్పుడు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఇలాంటి దిగజారుడు రాజకీయం చంద్రబాబు కి మాత్రమే సాధ్యం అని ఎద్దేవా చేశారు. పయ్యావుల మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి ఇది టీడీపీకి షాక్ లాంటిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: