మెగాస్టార్ చిరంజీవి ఓ స్టార్‌ డైరెక్టర్‌తో రెండు సార్లు సినిమాలను మిస్‌ చేసుకున్నారు. `ఠాగూర్‌`లాంటి బ్లాక్‌ బస్టర్స్ ని ఆయన ముందే మిస్‌ చేసుకున్నారు.మరి ఆ సినిమాలేంటి? ఆ దర్శకుడెవరు?మెగాస్టార్‌ చిరంజీవి.. చాలా సినిమాలను వదులుకున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ల సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని హిట్‌ అయితే మరికొన్ని ఇండస్ట్రీ హిట్లుగా మిగిలాయి. అయితే ప్రధానంగా రెండు సినిమాలను మాత్రం చిరంజీవి వదులుకోవడం పెద్ద పొరపాటు అనే చెప్పాలి. అయితే ఈ రెండు చిత్రాలకు ఒకే దర్శకుడు, హీరో కూడా ఒక్కరే కావడం విశేషం.
చిరంజీవి కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ చిత్రాలు చాలానే ఉన్నాయి. ఖైదీ, ఠాగూర్‌ లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన్ని హీరోగా, ఇమేజ్‌ పరంగా, మార్కెట్‌ పరంగా కొన్ని మెట్లు ఎక్కించిన చిత్రాలు చాలా ఉన్నాయి. అయితే ఆయన మిస్‌ చేసుకున్న చిత్రాల్లో బిగెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ కూడా ఉండటం గమనార్హం.సౌత్‌ డైరెక్టర్స్ లో శంకర్‌ పేరు ప్రముఖంగా నిలుస్తుంది. బాహుబలి`కి ముందు ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. భారీ కమర్షియల్‌ చిత్రాలకు ఆయన కేరాఫ్‌. సందేశాన్ని వాణిజ్య అంశాలను సమపాళ్లలో మేళవించి ఇండస్ట్రీ హిట్లు అందించిన ఘనత ఆయనది. `జెంటిల్‌మ్యాన్‌, ఇండియన్‌, ఒకే ఒక్కడు, నాయక్‌, జీన్స్, అపరిచితుడు, శివాజీ, రోబో, 2.0 వంటి బ్లాక్‌ బస్టర్స్ ని ఆయన చిత్ర పరిశ్రమకి అందించారు. దర్శకుడిగా తానేంటో నిరూపించుకోవడమే కాదు ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్‌ గా ఎదిగాడు.
అయితే శంకర్‌ తొలి సినిమా చిరంజీవితో చేయాలనుకున్నాడట. ఆయన అర్జున్‌తో జెంటిల్ మెన్‌ సినిమాని చేశాడు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆయనపై పడింది. కమల్‌ హాసన్‌ కూడా ఫిదా అయ్యారు. దీంతో `ఇండియన్‌`కి అవకాశం ఇచ్చాడు. అయితే `జెంటిల్మెన్‌ మూవీని మొదటి చిరంజీవితో చేయాలనుకున్నారట శంకర్‌. కానీ మెగాస్టార్‌ ఒప్పుకోలేదు. దీంతో అర్జున్‌ తో చేశాడు. అర్జున్‌కి అది పెద్ద హిట్‌. హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లిన మూవీ. అయితే ఈ చిత్ర హిందీ రీమేక్ లో నటించాడు చిరు. కానీ అక్కడ పెద్దగా ఆడలేదు. దీనికి మహేష్‌ భట్ దర్శకత్వం వహించారు.
దీంతోపాటు ఆరేళ్ల తర్వాత అర్జున్‌తో ఒకే ఒక్కడు సినిమా చేశాడు శంకర్‌. మనిషా కోయిరాలా హీరోయిన్‌గా, రఘువరన్‌ విలన్‌గా నటించిన ఈ మూవీ కూడా అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలచింది. అర్జున్‌ ఇమేజ్‌ని మరో స్థాయికి పెంచిన చిత్రమిది. సౌత్‌ టాప్‌ స్టార్స్ లో ఒకరిగా అర్జున్‌ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. శంకర్‌ ఈ మూవీ స్క్రిప్ట్ ని ముందుగా చిరంజీవికే చెప్పారట. ఈ చిత్రాన్ని మొదట శంకర్‌ తెలుగు తమిళంలో ఏకకాలంలో చేయాలనుకున్నారు. ఇద్దరు వేర్వేరు హీరోలతో ప్లాన్‌ చేశారు. తమిళంలో అర్జున్‌తో, తెలుగులో చిరంజీవితో చేయాలనుకున్నారు. కానీ చిరు నో చెప్పాడు. కారణం ఆయనకు డేట్స్ లేకపోవడమే. ఇక్కడ అప్పటికే చిరంజీవి ఇతర ప్రాజెక్ట్ లతో లాక్‌ అయిపోవడంతో చేయలేకపోయారట చిరు. అదే చేసి ఉంటే ఠాగూర్‌ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ సినిమా చిరంజీవికి పడేది అని చెప్పొచ్చు.
ఆ సమయంలో తెలుగులో చిరంజీవి స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు చిత్రాలు చేశారు. ఇందులో స్నేహం కోసం బాగానే ఆడింది. కానీ ఇద్దరు మిత్రులు పెద్దగా ఆడలేదు. ఆతర్వాత అన్నయ్య చిత్రం చేశాడు. మృగరాజు, శ్రీమంజునాథ, డాడీ ఇలా అన్ని పరాజయాలు సాధించాయి. ఇంధ్ర`తో మళ్లీ పుంజుకున్నారు చిరు. కానీ గ్యాప్‌లోనే `ఠాగూర్‌ లాంటి హిట్‌ పడితే చిరంజీవి రేంజ్‌ మరింత పెరిగేది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అలా శంకర్‌తో రెండు సార్లు సినిమాలను మిస్‌ చేసుకున్నారు చిరంజీవి. కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు ఆయన కొడుకు రామ్‌ చరణ్‌కి రావడం విశేషం. చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ చిత్రం వస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటించగా, శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌ జే సూర్య, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌. మరో ఐదుగురు హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఇందులోచిరు ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: