తెలంగాణలో ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. కొందరు ఉపాధ్యాయులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇన్నాళ్లు బదిలీలు ఎప్పుడు చేస్తారు అని అడిగిన ఉపాధ్యాయులు, ఇప్పుడెందుకు కాదంటున్నారు? బదిలీల మార్గదర్శకాల విషయంలో  నిబంధనలు సరిగ్గా లేవా? ప్రభుత్వం ఇచ్చిన 317 జీవోను ఉపాధ్యాయులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? తెలంగాణలో సుమారు 25 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ కానున్నారు. ప్రస్తుతం వీరంతా పనిచేస్తున్న జిల్లా నుంచి ఉమ్మడి జిల్లాలోని మరో జిల్లాకు వెళ్లనున్నారు. కాగా ఇప్పటికే రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఇక ఈ ప్రక్రియ సీనియారిటీని పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయులు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం బదిలీలు జరిగాయి.

బదిలీల్లో అధికశాతం జూనియర్లు ఉండనున్నారు. 3 లేదా 4 ఏళ్లలో పదవీ విరమణ పొందే వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మారుమూల జిల్లా నుంచి నగర ప్రాంతాలకు ఆప్షన్స్ ఇచ్చుకొని మరొక జిల్లా కి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా కొత్త జిల్లాలో కొన్ని సంవత్సరాలు చేస్తే పదవి విరమణ తర్వాత తాము కోరుకున్న చోట స్థిరపడచ్చని  పలువురు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. మరోవైపు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నారని  ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వివిధ జిల్లాలకు సంబంధించి సీనియర్ లిస్ట్ విడుదల చేయకుండా ఎలా బదిలీలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

 జిల్లాలో కేటాయింపులు జరిగిన అవతవకలు సరి చేయకుండానే నూతన జిల్లాల్లో పోస్టింగ్  ఇవ్వాలని హడావిడిగా ఆదేశించడం అన్యాయం అంటున్నారు. కొత్త జిల్లాల వారీగా కేటాయింపుల తర్వాత ఉపాధ్యాయుల మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. అందులోనే లింక్ ను క్లిక్ చేస్తే కేటాయించిన జిల్లా, ఇతర వివరాలతో కూడిన ఉత్తర్వులను పొందవచ్చు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు డియిఓ లకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఏప్రిల్ లో విద్యా సంస్థలు ముగిసిన తర్వాతే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ఉండవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: