పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. వైసీపీ మళ్లీ గెలిస్తే ఏపీకి భవిష్యత్తు ఉండదన్నారు. డైరెక్టుగా చంద్రబాబు పొత్తుల ప్రస్తావన తీసుకొస్తే చూద్దామని చెప్పారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందనీ.. పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందన్నారు. బీజేపీతో తమకు పొత్తు ఉందనీ.. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలని అభిప్రాయపడ్డారు పవన్.

వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్ధతుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. ఐదేళ్ల సమయం ఇవ్వండి.. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. సమాజంలో మార్పు కోసం యువత ఆలోచించాలని హితవు పలికారు. తనను సింగిల్ గా రావాలని అడిగేందుకు వైసీపీ ఎవరు..అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. ప్రజలు రేపు అధికారం ఇచ్చినా బాధ్యతగా స్వీకరిస్తానన్నారు పవన్ కళ్యాణ్. తనకు పదవులు.. డబ్బుపై వ్యామోహం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్న పవన్ కళ్యాణ్.. ఎవరెవరు కలిసి వస్తారో తనకు ఇప్పటికీ తెలియదన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంపై అందరూ కలిసి చర్చించాలన్నారు. ఏపీ పరిస్థితిని తమ మిత్రపక్షం బీజేపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సరైన సమయంలో వ్యూహాలు.. రోడ్ మ్యాప్ ల గురించి చెబుతామన్నారు. రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదనీ.. ఎవరికీ రక్షణ లేదని చెప్పారు.

151మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వైసీపీ నేతులు విర్రవీగుతున్నారని.. భవిష్యత్తులో ఆ పార్టీ 15సీట్లకే పరిమితం కావొచ్చని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. తన ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టినా భయపడేది లేదన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలేవి అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయరని నిలదీశారు. మద్య నిషేధం అమలు చేయలేదు. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదు.. ధరల స్థిరీకరణ నిధి ఉంటే రైతు ఆత్మహత్యలు ఆగేవి అని పవన్ అన్నారు.

ఇక కౌలు రైతుల కుటుంబాలను జనసేన ఆదుకుంటుందని నంద్యాల జిల్లా శిరివెళ్లలో జరిగిన రచ్చబండలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కౌలు రైతుల గురించి జనసేన మాట్లాడేవరకు ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. 131మంది కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామన్నారు. వైసీపీ నేతలు సాయం చేయరన్నారు. తమను చేయనివ్వరన్నారు. రైతులకు సాయం చేసే దళారీ వ్యవస్థ కావాలన్నారు. కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు పవన్ కళ్యాణ్.



మరింత సమాచారం తెలుసుకోండి: