రాష్ట్ర బీజేపీ చాలా విచిత్రమైన పరిస్ధితులను ఎదుర్కొంటోంది. పార్టీ పరంగా చూస్తే అందరు బీజేపీ నేతలుగానే చెలామణి అవుతున్నారు. అయితే వీరిలో నిజంగా ఎంతమంది కమలనాదులున్నారో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఎందుకంటే బీజేపీలో ఒరిజినల్ నేతలు, వలసనేతలు అందరు కలిసిపోయున్నారు. ఇపుడు ఒరిజినల్ నేతల్లో కూడా టీడీపీని సమర్ధించేవాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతోంది. దాంతో పార్టీలో ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా పెట్టాలో కూడా అర్ధంకావటంలేదు.




తాజాగా మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజుకు పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వటం పెద్ద చర్చగా మారిపోయింది.  రాజుగారు మొదటినుండి బీజేపీ మనిషే అనటంలో సందేహంలేదు. అయితే ఈమధ్య తరచుగా చంద్రబాబునాయుడును పొగుడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో  కచ్చితంగా టీడీపీతో పొత్తుండాల్సిందే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే ఒరిజినల్ కమలనాదుల్లో ఎవరికీ చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవటం ఏమాత్రం ఇష్టంలేదు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు చేతిలో పార్టీ మూడుసార్లు దెబ్బతిన్నది కాబట్టే.




ఈ విషయం రాజుగారికి బాగా తెలిసికూడా మరి టీడీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారో చాలామందికి అర్ధంకావటంలేదు. బీజేపీలో ఉంటు టీడీపీకి మద్దతుగా మాట్లాడినందుకే రాజుకు పార్టీ షోకాజ్ నోటీసిచ్చింది. ఇదే నిజమైన కారణమైతే జమ్మలమడుగు నేత ఆదినారాయణరెడ్డి కూడా తరచూ టీడీపీకి మద్దతుగానే మాట్లాడుతున్నారు. ఈయన కాంగ్రెస్ లో నుండి వైసీపీలోకి అక్కడి నుండి టీడీపీలోకి దూకారు. మళ్ళీ అక్కడి నుండి బీజేపీలోకి వెళ్ళారు. రేపు టీడీపీ, బీజేపీ పొత్తుంటే బీజేపీలోనే ఉంటారు. లేకపోతే తిరిగి టీడీపీలోకి వచ్చేస్తారు.




ఇక రెడ్డిని వదిలేస్తే బీజేపీలో ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు, లంకా దినకర్ లాంటి చాలామంది నేతలు టీడీపీ మద్దతుదారులే అన్న విషయం తెలిసిందే. వీళ్ళున్నది బీజేపీలోనే అయినా పనిచేసేది మాత్రం చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికే అని అందరికీ తెలుసు.  అంటే విష్ణురాజు లాంటి నేతలు చాలామంది బీజేపీలో ఇంకా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిచేస్తారు ? వాళ్ళకు కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: