సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే జీవితానికి భరోసా అనుకుంటాం. కానీ, అదే సాఫ్ట్‌వేర్ పేరు చెప్పి, అనిమేషన్ అంటూ అద్భుతాలు సృష్టిస్తానని నమ్మించి, ఏకంగా వందల కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసం ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది. విజయవాడను అడ్డాగా చేసుకుని కిరణ్ అనే వ్యక్తి ఆడిన ఈ మాయాజాలానికి పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా వందలాది మంది బలయ్యారు. చివరికి బాధితులు లబోదిబోమంటున్నారు.

"యానిమేషన్ రంగంలో మనమే తోపు.. దేశ విదేశాల నుంచి ప్రాజెక్టులు వెల్లువెత్తుతున్నాయి.. మీరు కొంచెం పెట్టుబడి పెట్టండి చాలు.. కోట్లకు పడగలెత్తొచ్చు".. ఇదీ కిరణ్ చెప్పిన స్కీమ్. విజయవాడలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేసి, యానిమేషన్ డెవలపింగ్‌లో దూసుకుపోతున్నామని భారీ ప్రచారం చేశాడు. నరసరావుపేటలోని పలుకుబడి ఉన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, అధిక లాభాల ఆశ చూపించాడు.

మాటలు నమ్మిన కొందరు వ్యాపారులు మొదట్లో భారీగానే పెట్టుబడులు పెట్టారు. కిరణ్ కూడా వారి నమ్మకాన్ని చూరగొనేందుకు, చెప్పినట్లే దాదాపు మూడేళ్లపాటు లాభాలను భారీ మొత్తంలోనే అందించాడు. ఇంకేముంది.. ఆయన నిజాయితీపరుడని నమ్మిన ఆ వ్యాపారులు, తమ బంధువులు, స్నేహితులతో కూడా పెట్టుబడులు పెట్టించారు.

అలా నోటి మాటతోనే దాదాపు 100 మందికి పైగా వ్యక్తుల నుంచి ఒక్క నరసరావుపేటలోనే 400 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మోసం కేవలం నరసరావుపేటకే పరిమితం కాలేదు. గుంటూరు, విజయవాడ, భీమవరం, కడప జిల్లాలతో పాటు విదేశాల్లోనూ బాధితులు ఉన్నారని తెలియడం ఈ స్కామ్ తీవ్రతకు అద్దం పడుతోంది.

మూడేళ్లపాటు సజావుగా సాగిన వ్యవహారం గత ఏడు నెలలుగా బెడిసికొట్టింది. లాభాలు కాదు కదా, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం ఆగిపోయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు నిలదీయడం మొదలుపెట్టారు. రెండు నెలల క్రితం బాధితులంతా ఏకమై విజయవాడలోని కార్యాలయానికి వెళ్లి గట్టిగా అడిగేసరికి, కిరణ్ తన కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పోతుందనే భయంతో బాధితులు కిరణ్ కోసం గాలించారు. అతను చెన్నైలో ఉన్నట్లు తెలిసి కొందరు అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. అయితే, స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని, ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించి, ఇది సివిల్ వివాదంలా పరిష్కరించుకోవాలని సూచిస్తూ పంపించేశారు. ఆ అదను చూసుకుని కిరణ్ అక్కడి నుంచి విదేశాలకు పారిపోయినట్లు బాధితులు వాపోతున్నారు.

ఈ మొత్తం వ్యవహారం ఎటువంటి అధికారిక పత్రాలు, ఒప్పందాలు లేకుండా కేవలం నమ్మకం మీద, నోటి మాట మీద ("జీరో బిజినెస్") జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనుకాడుతున్నారు. మోసపోయామని తెలిసినా, ఆధారాలు లేకపోవడంతో న్యాయపోరాటానికి సిద్ధపడలేకపోతున్నారు.

ఈ భారీ మోసంపై స్పందించిన నరసరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు, యానిమేషన్ వ్యాపారం పేరుతో మోసపోయిన బాధితులు ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి చట్టపరంగా పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: