విజయవాడలో తనపట్టు నిరూపించు కోవాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ పట్టణ అధ్యక్షుడు వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబునాయుడు విజయవాడ లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కేశినేని నాని పేరును ఖరారు చేయడంతో.. వంశీకి నిరాశ తప్పలేదు.   దీంతో, వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి నాని అభ్యర్థిత్వం దాదాపు ఖరారయినట్టే అని తెలుస్తోంది. వంశీకి ఊరటలా ఆయన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఇక విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా నాగుల్ మీరా ఎంపికయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబునాయుడు ఈరోజు నియామయాలను ప్రకటించారు. అయితే వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు యాత్రతో పాటు ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల చిట్టా ఆయన వద్ద ఉందని సమాచారం. మూడు రోజుల క్రితం రాజమండ్రి, అమలాపురంలకు మురళీ మోహన్, గొల్లపల్లి సూర్యారావులను ఇంఛార్జులుగా నియమించారు. వారే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల బాధ్యతలను బాబు నేతలకు అప్పగించారు. విజయవాడ పార్లమెంటు స్థానం బాధ్యతలు కేశినేని నానికి, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు వల్లభనేని వంశీకి, విజయవాడ పశ్చిమ బుద్దా వెంకన్నకు, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీరే ఆ నియోజకవర్గాల నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు అప్పగించిన బాబు మీ మీ నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్లి పని చేసుకోవాలని, పార్టీ సంస్థాగత పటిష్టత పైన దృష్టి సారించాలని సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: