స్మగ్లర్లు పచ్చగా ఉండే అడవి తల్లికి తనువంతా గాయాలు చేస్తుంటే.. ఆకలి తీర్చుకోవడం కోసం జంతువులు మనుషుల పొట్టగొడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో  అటవీశాఖ యంత్రాంగం మదపుటేనుగులకు చెక్‌ పెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
 
 

చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు  నియోజకవర్గాలలోని అటవీ ప్రాంత సరిహద్దులలోని గ్రామాల ప్రజలు ఇప్పుడు ఎనుగుల పేరు చెబితే హడలి పోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అడవి జంతువుల పాలవుతుంటే చూడలేక వాటిని తరిమే ప్రయత్నంలో ప్రాణాలు కొల్పోతున్నారు రైతులు.

 

ఏనుగులకు చెరకు, అరటి, వరి, టమోటా, బీన్స్ తోటలు ఇష్టంగా తింటాయని... వాటికి బదులు మిరప, అముదం పంటలు పండించాలని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. దీనికి రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిరప, అముదం పంటలు పెట్టి గిట్టుబాటు లేక పస్తులు ఉండాల్సి వస్తుందని అంటున్నారు. భారీగా ఖర్చులు పెట్టి తాము గిట్టుబాటు లేని పంటలను ఎలా పండిస్తామని వారు వాదిస్తున్నారు.

 

ఎట్టకేలకు సమస్య పరిష్కారానికి అటవీశాఖ యంత్రాంగం టెక్నాలజీతో ఎనుగుల దాడులకు చెక్ పెట్టాలని చూస్తోంది. మదనపుటేనుగులకు జీపీఎస్‌ కాలర్స్‌ ఏర్పాటు చేసి దాడులకు చెక్‌ పెట్టేందుకు నిర్ణయించింది. ఆ మేరకు జీపీఎస్‌ పరికరాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచనున్నారు. కెన్యా నుంచి ఎలిఫెంట్‌ జీపీఎస్‌ కాలర్స్‌ దిగుమతి చేసుకొని 35 ఏనుగుల గుంపులో ఉన్న ఆరు మదపుటేనుగులకు వీటిని అమర్చనున్నారు. ఈ పరికరాల సాయంతో ఎప్పటికప్పుడు గజరాజుల కదలికలను  గుర్తించనున్నారు.  

 

జీపీఎస్‌ కాలర్‌ ఉపగ్రహానికి  అనుసంధానమై ఉండటంతో వీటిని కలిగిన ఏనుగులు ఏ ప్రాంతంలో సంచరిస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు. ఆ మేరకు అధికారులు ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ ను అప్రమత్తం చేశారు. సంబంధిత సిబ్బంది అక్కడికి చేరుకొని జనావాసాలు, పంటపొలాల వైపు మదపుటేనుగులు రాకుండా దారిమళ్లిస్తారు. దీంతో పంట నష్టం జరగకుండా, మనుషులకు ప్రాణహాని కలగకుండా నివారించవచ్చు. మరి చూడాలి జిల్లా రైతులకు అధికారులకు కొత్త ఐడియాలు ఏ మేరకు ఉపయోగపడుతాయో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: