మున్సిపల్ ఎన్నికల్లో బాధ్యత అంతా.. ఎమ్మెల్యేలదే అని చెప్పేసింది టీఆర్ఎస్ అధిష్టానం. ఎమ్మెల్యేల చేతుల మీద నుంచే ఎన్నికలు జరిగితే పార్టీకి లాభమా..? నష్టమా అనే చర్చ మొదలైంది. పాత కొత్తల సమన్వయం ఉంటే సరి.. లేదంటే సమస్యలు తప్పవంటున్నాయి పార్టీ వర్గాలు. గెలిచి తీరాలని ఎమ్మెల్యేలు... తమ వర్గానికే ప్రాధాన్యత ఇవ్వాలని నేతలు పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

మున్సిపోల్స్ బాధ్యత ఎమ్మెల్యేలదే అని చెప్పిన టీఆర్ఎస్.. వాళ్లు లేని చోట ఇంఛార్జ్ లు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మున్సిపోల్స్ పై నేతలకు దిశా నిర్దేశం చేశారు. మున్సిపోల్స్ బాధ్యత  ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలకు అప్పగిస్తే జరిగే లాభ నష్టాలపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే పాత, కొత్త నేతలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరిన చోట సమన్వయ లోపం కనిపిస్తోంది. గ్రూప్ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి.

 

గ్రూప్ లు, పాత కొత్త సమస్య లేని చోట అంతా ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు భాద్యత తీసుకుంటే ఇబ్బందులు రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతా ఒకరిపైనే ఉంటుందని... గెలుపు ఓటముల భాద్యత వారిపైనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటారన్న వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మాజీలను కలుపుకొని పరిస్థితుల్లో పార్టీకి సమస్యలు వస్తాయన్న అభిప్రాయం ఉంది. తమ వర్గం పట్టు నిలుపుకునే ప్రయత్నంలో రెబల్స్ ను రంగంలోకి దింపే అవకాశాలు లేకపోలేదు .అప్పుడు టిఆర్ఎస్ తో టిఆర్ఎస్ కే పోటీ అన్న పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యేలు లేని చోట పార్టీ ఇంఛార్జీలు ఉన్నారు. ఆయా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు కూడా తమ అనుచరులకు అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తారు .అప్పుడు ఇద్దరు కలిసి మాట్లడుకుని అభ్యర్ధులను ప్రకటించలేకపోతే గులాబి పార్టీకి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

మొత్తంగా ఎమ్మెల్యేలే అంతా అన్న పార్టీ నిర్ణయం మున్సిపోల్స్ లో ఎటువంటి ఫలితాలను తీసుకువస్తుంది అన్న చర్చ జరుగుతోంది. అంతా సవ్యంగా జరుగుతుందా లేక ...వర్గపోరు మొదలై పార్టీకి నష్టం చేకూరుస్తుందా అనేది చూడాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: