నెల్లూరు పొగాకు కేంద్రం దళారుల దందా మితిమీరుతోంది. చివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగొలు కేంద్రాల్లోనూ దళారుల పెత్తనానికి గిట్టుబాటు ధర లభించక రైతులు‌ గొల్లుమంటున్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈ సారి తక్కువ ధరలతో పొగాకు వేలం ప్రారంభం కావడంతో,  నష్టాలు తప్పవనే నిస్పృహలోకి పోతున్నారు రైతన్నలు.


 
నెల్లూరు జిల్లాలో పొగాకు బోర్డు రెండు కేంద్రాలను‌ ఏర్పాటు చేసింది. అత్మకూరు నియోజక వర్గం మర్రిపాడు మండలం డిసి పల్లి ఒకటి, ఉదయగిరి నియోజక వర్గం కలిగిరిలో మరొటి ఏర్పాటు చేసింది. ఈ సారి ముందుగా మర్రిపాడు మండలం డిసి పల్లి పొగాకు కేంద్రంలో కొనుగోళ్ళు ప్రారంభమయ్యాయి. ఈ బోర్డు పరిధిలో మర్రిపాడు, ఆత్మకూరు, ఏఎస్ పేట మండలాలలో సుమారు 2వేల 226 మంది రైతులు పొగాకు పంటను సాగు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది 4.589 హెక్టార్లలో పంటను సాగు చేశారు. మొత్తం 6.1 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి లభించింది. అయితే  వేలంలో పలికిన ధరలు రైతులను నిస్తేజం లోకి నెట్టాయి.   

 

పండించిన పొగాకు పంటను గ్రేడింగ్ నిర్వహించి బేళ్ళను ట్రాక్టర్ల ద్వారా ఎంతో ఆశతో వేలం కేంద్రం వద్దకు తీసుకొని వస్తే,  మొదటి రోజే మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. మూడు ప్రముఖ కంపెనీలు వేలంలో పాల్గొన్నాయి. బోర్డు అధికారుల సమక్షంలో ఎలక్ట్రానిక్ పరికరాలతో నిర్వహించిన వేలం ప్రక్రియలో,  కిలో కనీస గరిష్ట ధర 170 పలకగా.. కనీస ధర 165 కు తో ముగిసింది. ఇదే గతేడాది 185-200 వరకు ధరలు‌ పలికాయి.   

 

పంటలు పండించేందుకే ఎకరాకు సుమారు 80 వేల వరకు ఖర్చవుతుందని.. ఇలా 165, 170 ధరలు పలికితే తాము చాలా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు  మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం ప్రతి ఏటా విఫలమవుతోందని రైతు సంఘం నాయకులు వాపోతున్నారు.

 

కొనుగోలు కేంద్రంలోని కొంతమంది సిబ్బంది, బయట వ్యాపారులతో కుమ్మక్కు అయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు తక్కువ రేటుకు పలికే విధంగా వేలం నిర్వహిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వేడుకుంటున్నారు. తమకు కేజీ 200 వరకు దక్కితేనే గిట్టుబాటు అవుతుందని, లేకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: