దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన వృద్ధులు,10 సంవత్సరాలలోపు పిల్లలు ఇల్లు దాటి బయటకు రాకూడదు అని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసింది. విదేశాల నుంచి భారత్ కు వచ్చే అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి మార్చి 22 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2,00,000 దాటింది. కరోనా భారీన పడి 9800 మంది మృతి చెందారు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 169కు చేరింది. వీరిలో 25 మంది విదేశీయులు ఉన్నారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్రం అత్యవసర విభాగాలు మినహా మిగతా ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని సూచించింది. 
 
అంతర్జాతీయ సరిహద్దులను భారత్ వారం రోజులు మూసేయనుంది. భారత్ లో కరోనా మృతుల సంఖ్య 4కు చేరింది. ఇటలీ నుంచి జర్మనీ మీదుగా తిరిగొచ్చిన 72 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయాడు. పంజాబ్ లోని నవాన్ షహర్ ఆస్పత్రిలో అతడు చనిపోగా అతనికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. 
 
ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కరోనా సోకకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాయి. కేంద్రం కరోనాను అడ్డుకోవడానికి దేశంలోని స్కూళ్లను మార్చి 31వరకు మూసేయాలని ఆదేశించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐఎస్ఈ బోర్డు పరీక్షలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని పంజాబ్ ప్రభుత్వం ప్రజా రవాణాను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: