లాక్‌డౌన్‌.. కరోనాను కట్టడి చేసేందుకు వేరే గత్యంతరం లేదంటూ ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు ఇవి. ఇందుకు ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమయంలో వలస జీవుల కష్టాల గురంచి సరిగ్గా అంచనా వేయకపోవడం, వారి పరిస్థితి తెలిసిన తర్వాత కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోవడం మానవత్వం అనిపించుకోవడం లేదు.

 

పొరుగూరికో.. పొరుగు రాష్ట్రానికో ఇతర దేశానికో వలస పోవడం మామూలే. కానీ మూట ముల్లె సర్దుకుని పిల్లాజెల్లతో ఎల్లలుదాటి రావడం.. ఒక విషాదమైతే.. ఇంతకాలం సేవ చేసినా, పట్నం ఆపత్కాలంలో ఆదుకోకపోవడం దారుణం. చేసేదిలేక.. కాపాడే దిక్కు కానరాక ఎక్కడివక్కడే వదిలిపెట్టి కన్నతల్లిలాంటి సొంతూరిని తలచుకుంటూ.. మైళ్ల తరబడి కాళ్లీడ్చుకుంటూ గుంపులు గుంపులుగా.. విడతలు విడతలుగా.. మిడతల దండల్లే కదిలిపోతున్న పల్లె జనాన్ని చూస్తే కొండంత విషాదం..

 

ఇంతమంది బడుగులు పొట్టచేత పట్టుకుని వచ్చి బస్తీల్లో బతుకుతున్నారని తెలిసీ ప్రభుత్వాలు సరైన ప్రణాళికతో వారిని గమ్యస్థానాలకు చేర్చితే ఇంకా బాగుండేది కదా అనే ఆవేదన మాత్రమే ఇది. తినడానికి తిండి లేక, పని చేసుకోవడానికి పని దొరక్క ఇన్ని లక్షలమంది సొంతూళ్ల బాట పట్టారు. ఇన్నాళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నవారికి వారి యజమానులు భరోసా ఇచ్చి ఇక్కడే ఉంచలేకపోవడం ఒక దారుణమైతే.. దారిలో.. ఊరి పొలిమేరలో ఆగినవారిని కూడా అడ్డుకున్న దుర్మార్గులు ఉండడం ఇంకా ఘోరం!

 

 

పిల్లా జెల్లతో కాళ్లకు సరైన చెప్పులైనా లేకుండా.. వందల మైళ్ల దూరం వారు నడిచైనా వెళ్లిపోడానికి సిద్ధపడ్డారంటే వారికి ఈ వ్యవస్థ ఎలాంటి భరోసానూ కల్పించలేకపోయిందన్న మాట. ఇది మనందరం చింతించాల్సిన విషయమే. అక్కడక్కడా కొందరు మానవత్వం పరిమళించి.. ఉన్నంతలో కొంత ఆహారాన్ని పంచినవారున్నారు. అలాంటివారికి మాత్రం శిరసు వంచి ప్రణామాలు. ఇలాంటి గాధలు పత్రికల్లో చాలా వస్తున్నాయి. మరి వీటిపై ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదు. మీ చావు మీరు చావండని వారిని అలా వదిలేయడం ఏమాత్రం మానవత్వమో ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: