కరోనా లాంటి విపత్తులు సంభవించినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలి. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. కానీ కేంద్రం -బెంగాల్ ప్రభుత్వం మధ్య కరోనా కూడా రాజకీయ అంశంగా మారిపోయింది.. కరోనాను కట్టడి చేయడంలో మమతా బెనర్టీ  ప్రభుత్వం విఫలమైందని మోడీ సర్కార్ వాదిస్తుంటే... కేంద్రం తీరుపై దీదీ కస్సుమంటున్నారు.

 

ఎనిమిది రోజుల వ్యవధిలో మూడు లేఖలు... కరోనా నియంత్రణ విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తూ కేంద్ర హోం శాఖ లేఖలపై లేఖలు రాస్తూనే ఉంది. మమత బెనర్జీ అసలే మొండి ఘటం.. మోడీని కూడా లెక్కచేసే మనిషి కాదు... దీంతో కేంద్ర వర్సెస్ వెస్ట్ బెంగాల్ సంక్షోభం ముదురుతోంది.  కరోనాపై ఎవరి వాదన వాళ్లు వినిపిస్తూ బెంగాల్ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. 

 

లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో బెంగాల్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నది కేంద్రం చేస్తున్న ఆరోపణ. రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించిన  హోం శాఖ కేంద్ర బృందాలను పంపుతున్నట్లు మమతకు లేఖ రాసింది. దీనిపై దీదీ తీవ్రంగా స్పందించారు. ఏ అంశాల ఆధారంగా తమ రాష్ట్రంలో ఏడు హాట్ స్పాట్లను గుర్తించారో చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు..

 

ఏడు జిల్లాల విషయంలో  కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోతే మంత్రుల బృందాన్ని రాష్ట్రంలో అడుగుపెట్ట నివ్వబోమని మమత స్పష్టం చేశారు. తమను సంప్రదించకుండానే, తమతో సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా  హాట్ స్పాట్ జిల్లాలను ఎలా ప్రకటిస్తుందని మమత ప్రశ్నిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు పెరగడానికి కేంద్ర నిర్లక్ష్యమే కారణమని మమత పదేపదే ఆరోపిస్తున్నారు. కరోనా కేసులను గుర్తించిన వెంటనే అంతర్జాతీయ విమాన సర్వీసులను  నిలిపివేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది మమత చేస్తున్న విమర్శ. కేంద్రం పంపించిన కరోనా టెస్టింగ్ కిట్స్ విషయంలోనూ మమత అసంతృప్తితో ఉన్నారు. 

 

అయితే కేంద్రం మాత్రం మమత తీరును తప్పుపడుతోంది.  కరోనా సృష్టించిన ఆరోగ్య సంక్షోభ సమయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతోంది. కోల్‌కతా, హౌరా, నార్త 24 పరగనాస్, ఈస్ట్ మిడ్నాపూర్, డార్జిలింగ్, కలిమ్‌పోంగ్, జల్పాయ్‌గురి జిల్లాలు  కరోనా హాట్ స్పాట్స్ గా మారిపోయాయని ఇప్పటికైనా స్పందించకపోతే రాష్ట్రానికే కాదు..దేశానికి కూడా ప్రమాదకరంగా మారుతుందని కేంద్రం హెచ్చరిస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకపోవడం, ప్రజలకు రేషన్ సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కేంద్రం ఆరోపిస్తోంది. రెండు మూడు రోజుల్లో కేంద్ర బృందాలు పశ్చిమబెంగాల్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే మమత బెనర్జీ వాళ్లను అనుమతించకపోతే... వివాదం మరింత ముదురుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: