రాష్ర్టానికి వెలుగులునిచ్చే ధర్మల్ పవర్ స్టేషన్ లో చీకటి బాగోతం సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికి, చోరీలు యథేచ్చగా జరుగుతున్నాయి. ఇటీవలే అరవై లక్షలు విలువ చేసే.. అత్యంత విలువైన సామాగ్రి మాయమైంది. మరి ఈ చోరీలో సూత్రధారులెవ్వరో అంతు చిక్కకుండా ఉంది. 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ లో భారీచోరీ వెలుగు చూసింది. కర్మాగారం నిర్మాణ సమయంలో బాయిలర్‌, టర్బైన్‌, ఇతర యంత్రాలకు సంబంధించిన విడి పరికరాలను ఓ అండ్‌ ఎం సమీపంలోని స్టోర్‌లో భద్రపరిచారు. దీనికి బీహెచ్‌ఈఎల్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కర్మాగార నిర్మాణం పూర్తై విద్యుత్‌ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చిన తర్వాత,  అవసరమైతే తప్ప స్టోర్‌ను తెరవటం లేదు. 

 

నాలుగురోజుల క్రితం స్టోర్‌ నుంచి ఓ బొలెరో వాహనంలో సామగ్రిని బయటకు తరలించారనే సమాచారం బీహెచ్‌ఈఎల్‌ అధికారులకు చేరింది.స్టోర్‌లో భారీ విలువైన విడిపరికరాలు చోరీకి గురయినట్టు కేటీపీఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌ గుర్తించారు. జెన్కో విజిలెన్స్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

 

సుమారు అరవై లక్షలు విలువైన ముఖ్యమైన స్పేర్ పార్టులు చోరీ జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు , చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ చోరీ వ్యవహారంలో కొంత మంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కెటిపిఎస్ లో తరచూ చోరీ లు జరగడం సర్వసాధారణమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని స్క్రాప్ కంపెనీలు చేతివాటం చూపుతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.  

 

చాకచక్యంగా చోరీ చేసినా లాక్ డౌన్ వల్ల లారీల్లోకి ఎక్కించుకుని, అమ్ముకోలేక పోయినట్లుగా తెలుస్తోంది. ఈ చోరీ సొత్తును ఒక్క చోట పాతి పెట్టారు. అదే వారి కొంప ముంచింది.  సొత్తును పోలీసులకు పట్టించింది. అయితే ఈ చోరీ వెనక సూత్రధారులు ఎవ్వరో తేలాల్సి ఉంది.మణుగూర్ బిటిపిఎస్ లో చోరీ జరిగి ఆరు నెలలు అయినప్పటికి ఇంత వరకు కేసు కొలిక్కి రాలేదు. మరి కేటీపీఎస్ లో జరిగిన ఈ చోరీ వ్యవహారం ఎప్పటి కొలిక్కి వస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: