తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిచిపోయి నెల రోజులు దాటింది. తిరిగి ఎప్పుడు దర్శనానికి అనుమతిస్తారో తెలియని పరిస్థితి. దాంతో నిత్య పూజలు అందుకునే శ్రీవారికి.. పూజా కైంకర్యాలు ఎలా జరుగుతున్నాయి..? స్వామి వారికి రాబడి తగ్గడంతో టీటీడీ ఆర్దిక పరిస్థితి ఎలా వుంది..? శ్రీవారి భక్తులను నమ్ముకున్న వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి..? భక్త జనం లేని తిరుమల ఇప్పుడు ఎలా వుంది..? 

 

ఆపద మొక్కుల వాడా.. ఆనాధ రక్షకుడా.. సప్తగిరులపై వెలసిన శ్రీనివాసుడా.. ఇలాంటి మాటలు తిరుమలలో నిత్య స్మరణగా ఉండేది. కానీ ఇప్పుడు భక్త జనం నోట ఆ మాటలు వినపడడం లేదు. ఎలాంటి చిన్న కష్టం వచ్చినా.. వెంటనే స్వామివారిని తలుస్తారు.. ఆ తర్వాత కోరిన కోర్కెలు తీరగానే మ్రోక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు క్యూ కడతారు.. కాని ఇప్పుడు ఆ క్యూ లైన్లు లేవు.. నిత్య భక్తి పారవశ్యం తొణికిసలాడే తిరుమల కొండంత ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. ఎందుకంటే.. భక్తులకు.. స్వామివారికి  అడ్డుగా కరోనా వచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు.. శ్రీవారి ఆలయం ఒక్కటి ఎమిటి.. ఏ ఆలయంలోను ఇప్పుడు భక్తులకు అనుమతి లేదు. కరోనా వైరస్ వ్యాపించకూండా వుండాలి అంటే సామాజిక దూరం తప్పనిసరి కావడంతో.. గత నెల 20 వ తేది నుండి శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు టిటిడి. దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న సమయంలోనే వెంటనే టీటీడీ అప్రమత్తమై.. ముందస్తు జాగ్రత్తలకు శ్రీకారం చుట్టింది. 

 

ముందుగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలును రద్దు చేసింది టీటీడీ. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకునేలా టైమ్ స్లాట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులు సంచరించే ప్రాంతాలలో ప్రతి రెండు గంటలకు ఒక్కసారి శానిటైజేషన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. కాని గత నెల 19వ తేదిన ఉత్తరప్రదేశ్ కి చెందిన భక్తుడు తిరుమలలో అస్వస్థతకు గురవ్వడంతో టీటీడీ ఉల్లిక్కిపడింది. భక్తుడికి కరోనా వైరస్ లక్షణాలు వున్నాయంటు అనుమానాలు రావడంతో చికిత్స కోసం స్విమ్స్ కి తరలించారు. అదే సమయంలో రాష్ర్ట ప్రభుత్వం స్పందించింది. పరిస్థితి చెయ్యి దాటకముందే నివారణ చర్యలు అంటూ శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ఆలయాలలో దర్శనాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారి చేశారు. స్వామి వారికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహించాలని టీటీడీని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో 20వ తేదీ మధ్యాహ్నం నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిచిపోయాయి. 

 

టీటీడీ చరిత్రలోనే కాదు.. అసలు శ్రీవారి ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదనే చెప్పవచ్చు. శ్రీవారి ఆలయంలో లభిస్తున్న ఆధారాల మేరకు 1892వ సంవత్సరంలో మహంతులు పాలనలో శ్రీవారి ఆలయాన్ని రెండు రోజుల పాటు మూసివేశారట. మహంతులు, జియ్యంగార్ల మధ్య తాళాలు గొడవ రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత గ్రహణం సమయంలో మాత్రమే శ్రీవారి ఆలయాన్ని ఆగమశాస్త్రం నిబంధన మేరకు మూసేవారు. గ్రహణం వీడిన అనంతరం శ్రీవారి ఆలయంలో శుద్ది కార్యక్రమాలు నిర్వహించి తిరిగి భక్తులను దర్శనానికి అనుమతించేవారు. ఇక 2018 సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో బాలాలయ అష్టభందన మహసంప్రోక్షణ నిర్వహించే సమయంలో.. దర్శన సమయం తక్కువగా వుండే అవకాశం వుండడంతో ఐదు రోజుల పాటు శ్రీవారి దర్శనాలు నిలిపివెయ్యాలని టిటిడి భావించింది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా చేసేసింది. కాని శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేత పై భక్తులు నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చివరికి టీటీడీ వెనక్కి తగ్గింది. దాంతో పరిమిత సంఖ్యలో భక్తులును దర్శనానికి అనుమతించింది టీటీడీ. 

 

ఇలా శ్రీవారి ఆలయంలో నిరంతరాయంగా జరుగుతున్న దర్శనాలకు ఇప్పుడు బ్రేక్ పడింది. కరోనా వైరస్ కారణంగా శ్రీవారి ఆలయంలో గత నెల 20వ తేది నుంచి నిరవధికంగా దర్శనాలు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో కరోనా తీవ్రతను బట్టి.. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం వుంది. కానీ మరో వైపు టీటీడీ.. ఇప్పటికే మే 31 వరకు సేవా టిక్కెట్లను, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పొందిన భక్తులు.. వాటిని రద్దు చేసుకుంటే డబ్బు తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను helpdesk@tirumala.org కి సమాచారం అందిచాలని కోరింది టీటీడీ. దీంతో ప్రాధమికంగా శ్రీవారి ఆలయంలో మే 31 వరకు దర్శనాలు లేనట్లే.  కరోనా వైరస్ కట్టడి అయ్యేవరకు దర్శనాల అనుమతి లభించే పరిస్థితి లేదు. ఎందుకంటే.. క్యూ లైనులో సామాజిక దూరం పాటించే అవకాశం తక్కువగా ఉండడంతో.. టీటీడీ రిస్క్ తీసుకునే అవకాశం లేదనే చెప్పాలి. దీంతో శ్రీవారి దర్శనభాగ్యం భక్తులకు తిరిగి ఎప్పుడు కలుగుతుంది..? అనే దానిపై ప్రస్తుతానికి టీటీడీకి కూడా క్లారిటీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: