దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చాప కింద నీరులా విస్తరిస్తోన్న కరోనా భారీన పడి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,83,000కు చేరగా మృతుల సంఖ్య 5000 దాటింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ రైలు ప్రయాణికుల కోసం షాకింగ్ నిబంధనలు అమలులోకి తెచ్చింది. నిబంధనలు పాటించిన ప్రయాణికులకు మాత్రమే రైళ్లలోకి అనుమతి ఉంటుంది. 
 
ఇకనుంచి రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు రైలు బయలుదేరే 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది. రైల్వే శాఖ టికెట్లు ఉన్నవారిని మాత్రమే రైళ్లలోకి, రైల్వే ప్రాంగణంలోకి అనుమతిస్తామని..... టికెట్లు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబోమని స్పష్టం చేసింది. గతంలోలా ఏసీ కంపార్టుమెంట్లలో ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వబోమని రైల్వే శాఖ తేల్చి చెప్పింది. 
 
ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోను రైళ్లలోకి అనుమతించబోమని రైల్వే శాఖ పేర్కొంది. ప్రయాణికులు కనీస సామాన్లతోనే రైలు ప్రయాణం చేయాలని సూచనలు చేసింది. ఎవరిలోనైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారు ప్రయాణం చేయకపోవడమే మంచిదని రైల్వే శాఖ సూచిస్తోంది. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు రైలు ప్రయాణాలు చేయవద్దని చెబుతోంది. 

రైళ్లలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. రైళ్లను, రైళ్ల ప్రాంగణాలను శుభ్రంగా ఉంచేందుకు రైల్వే శాఖకు సహకరించాలని కోరింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనలు పాటించిన వారిని మాత్రమే రైల్వే శాఖ అనుమతించనుంది. రేపటినుంచి పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలు జరగనుండగా రైల్వే శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.                     
 

మరింత సమాచారం తెలుసుకోండి: