భారత్‌లో కరోనా కేసులు 5లక్షలు క్రాస్ చేశాయి. రోజు రోజుకు కేసుల తీవ్రత రెట్టింపవుతోంది. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్రత మరింత ఎక్కువగానే ఉంది.

 

దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. పాజిటివ్‌ కేసుల నమోదులో మరో కొత్త రికార్డు నమోదైంది. మొత్తం కేసులు 5లక్షల మార్కును క్రాస్ చేశాయి. మరణాల సంఖ్య 15వేల 600 దాటాయి. కేసుల తీవ్రత పెరుగుతున్నప్పటికీ.. కోలుకున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 2లక్షల 85వేల 637మంది కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 58.25శాతంగా ఉంది. 

 

కరోనా కేసుల వ్యాప్తిలో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. నిన్న ఒక్కరోజే ఐదు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 175 మంది కరోనాతో చనిపోయారు. ఇటు ఢిల్లీలోనూ తీవ్రత అధికంగానే ఉంది. కొత్తగా 3వేల 460 కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77వేల 240కి చేరాయి. ఇప్పటివరకు 47వేల 91 మంది కోలుకొని డిశ్చార్జయ్యారు. 2, 492 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 27వేల 657 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

 

ఢిల్లీ తర్వాత తమిళనాడులో ఉంది. ఇక్కడ కొత్తగా 3వేల 645 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74వేల 622కి పెరిగింది. 24గంటల్లో మరో 46 మరణాలు నమోదవ్వడంతో మొత్తం మరణాల సంఖ్య 957కి చేరింది. ప్రస్తుతం తమిళనాడులో 32వేల 305 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇటు గుజరాత్‌లో 580 కొత్త కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 30వేల 158కి పెరిగింది. వీరిలో 22వేల 038మంది డిశ్చార్జి కాగా.. 1, 772 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

బెంగాల్‌లో 542 కేసులు, 10 మరణాలు రికార్డయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16వేలు దాటాయి. మరణాల సంఖ్య 616కి పెరిగింది. ఇటు కేరళలో 105 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1846 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వెల్లడించారు. కర్ణాటకలో 445కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11వేలు క్రాస్ చేశాయి. వీరిలో 6,916మంది కోలుకొని డిశ్చార్జి కాగా 180మంది చనిపోయారు. 

 

దేశవ్యాప్తంగా 1016 ల్యాబోరేటరీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఐసీఎంఆర్‌ ప్రకటించింది. వీటిలో 737 ప్రభుత్వ ల్యాబోరేటరీలు కాగా.. 279 ప్రైవేటు ల్యాబోరేటరీలు ఉన్నాయి.  దీంతో కరోనా పరీక్షల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత 24గంటల్లో 2,15,446 శాంపిల్స్‌ టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 77లక్షల 76,228 శాంపిల్స్‌ను పరీక్షించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: