తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్‌ ను ఇరుకున పెడుతున్నారు. కొత్త సచివాలయం నిర్మాణం కోసం ఊవ్విళ్లూరుతున్న కేసీఆర్  స్పీడ్‌కు బ్రేకులు వేసేలా ఆయన వెలుగులోకి తెచ్చిన అంశం ఇప్పుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయాన్ని పడగొట్టి అదే స్థలంలో కొత్త సచివాలం నిర్మించాలని పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. 

 

 


దీని వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని.. కేవలం ఇది ప్రజాధనం వృథాయేనన్నది రేవంత్ రెడ్డి గట్టి నమ్మకం. ఇదే సమయంలో దీన్ని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం తక్కువ. అందుకే  కొత్త సచివాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 

 

 

అయితే ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఓ కొత్త అంశాన్ని, సచివాలయం కూల్చి వేతలో మరో కొత్త కోణాన్ని కొన్ని రోజుల క్రితం బయటపెట్టారు. అదే గుప్తనిధుల వ్యవహారం.. పాత సచివాలయం కింద భూగర్భంగాలో నిజాం కాలం నాటి నిధులు ఉన్నాయని.. వాటి కోసమే కేసీఆర్ సచివాలయం కూల్చి వేతకు నడుంబిగించారని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

 

 

సచివాలయం జీ బ్లాక్‌ కు సంబంధించి సీఎం కేసీఆర్ చాలా ప్రణాళికగా ముందుకు వెళ్లారని, మాయ మాటలతో హెరిటేజ్ బిల్లును పాస్ చేయించుకున్నారని రేవంత్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. తన బంధువు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న రఘునందన్ రావును ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసి కేసీఆర్ ఈ కార్యచరణను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రారంభించారని రేవంత్ కొన్నిరోజుల క్రితం ఆరోపించారు. సచివాలయం కూల్చివేతకు కోర్టు నుంచి అనుమతి రాగానే సీఎం ఫాంహౌస్‌కి వెళ్లారని ప్రచారం జరుగుతోందని, సీఎం ఫాంహౌస్‌కి వెళ్లారా లేక, మరేదైన రహస్య ప్రదేశానికి వెళ్లారా.. అనేది అనుమానంగా ఉందన్నారు. సచివాలయ భవనాల కింద గుప్తనిధులు లేకపోతే అంత రహస్యంగా ఎందుకు కూల్చుతున్నారని రేవంత్ రెడ్డి కొన్నిరోజుల క్రితం ప్రశ్నించారు. ఇప్పుడు హైకోర్టు కూడా సచివాలం కూల్చివేతలో అంత రహస్యం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో  అందరి ఫోకస్ గుప్తనిధులపై పడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: