2009 నుంచి దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ సైన్యాన్ని, నౌకల్ని భారీగా మోహరిస్తూ వస్తోంది. గల్వాన్ ఘర్షణ జరిగిన వెంటనే భారత్.. దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపినట్లు నౌకాదళం తెలిపింది. ఈ చర్య ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందని వివరించాయి. భారత్‌తో జరిగిన దౌత్య చర్చల్లో ఈ అంశాన్ని చైనా విదేశాంగ ప్రతినిధులు ప్రస్తావించినట్లు అధికారులు తెలిపారు. భారత్ నౌకల్ని పంపించడంపై చైనా పాలకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధనౌకలూ సంచరిస్తున్నాయి. అక్కడ మోహరించిన భారత యుద్ధనౌక.. రహస్య సాధనాల ద్వారా వీటితో కమ్యూనికేషన్ సాగించింది. ఇతర దేశాల యుద్ధనౌకలూ తమ కదలికలను మన నౌకకు తెలియజేశాయి. ఈ ఆపరేషన్ మొత్తాన్నీ భారత్ గోప్యంగా సాగించింది. మలాక్కా జలసంధి నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా యుద్ధనౌకల రాకపోకలను సమర్థంగా పర్యవేక్షించేందుకు జలాంతర నౌకలు, మానవరహిత వ్యవస్థలు, ఇతర సెన్సర్లను తక్షణం సమకూర్చుకోవాలని ఇండియన్ నేవీ ప్రయత్నాలు చేస్తోంది.
అండమాన్‌కు సమీపంలోని మలక్కా జలసంధి వద్ద కూడా భారీగా యుద్ధనౌకలను భారత్ మోహరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించడానికి చైనా నేవీ ఇదే మార్గాన్ని ఉపయోగించుకుంటోంది. వీటి కదలికలను కట్టడి చేయడానికే ఇండియన్ నేవీ నౌకల్ని మోహరించినట్లు తెలుస్తోంది. చైనా వాణిజ్య నౌకలు కూడా ఎక్కువగా ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. తూర్పు, పశ్చిమ తీరాల్లో శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టే సామర్థ్యం మన నౌకా దళానికి ఉందని అధికారులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి