అమరావతి: న్యాయమూర్తులపైన ఫిర్యాదు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీజేఐకే లేఖ రాయడమే కాదు.. దాన్ని మీడియాకు కూడా విడుదల చేశారు. ఇప్పుడది కోర్టు ధిక్కారణ అన్నటువంటి అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమవుతోంది. అయితే ఈ లేఖ విడుదల చేసేముందు జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోదీని కూడా కలిశారు. కచ్చితంగా ప్రధాని మోదీని కలిసిన రోజునే సీజేఐకు ఫిర్యాదు లేఖ పంపినట్టుగా తేదీ బట్టి తెలుస్తోంది. ఆ ఇష్యూ తరువాత వైసీపీ నేతలు ఒకరకమైన ప్రచారాన్ని మొదలుపెట్టారనే ఆరోపణ ఉంది. తాము కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీలకు చెప్పిన తరువాతే ఈ ఫిర్యాదు చేశామని, మీడియాకు లేఖ విడుదల చేశామనే ప్రచారం మొదలైంది. అది వైసీపీ నుంచి వచ్చిందా లేక వేరే వారు ప్రచారం చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఇది అంతర్గతంగా అయితే సాగిపోతోంది. నిజానికి ఏపీలో తాము ఏం చేసినా కేంద్ర పెద్దలతో చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి అనేక సార్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన అనేక నిర్ణయాలు, మూడు రాజధానులు వంటి వాటికి సంబంధించి ముందుగానే బీజేపీ పెద్దలకు చెప్పారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

దానికి తగ్గట్టుగానే బీజేపీ రియాక్షన్ ఉంటోంది. ఈ విషయం ముందుగానే బీజేపీ పెద్దలతో పంచుకుంటున్నారు. వారి నుంచి సానుకూల స్పందన రావడంతోనే ముందుకు వెళ్తున్నారని బీజేపీ పెద్దల నుంచి వైసీపీ నిర్ణయాలపై వ్యతిరేకత రాకపోవడంతోనే అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ చొరవతోనే ఇప్పుడు న్యాయవ్యవస్థ విషయంలోనూ తాము కేంద్ర పెద్దలకు చెప్పే దాడి చేస్తున్నామన్న అభిప్రాయాన్ని వైసీపీ నేతలు చెబుతున్నట్టు కనిపిస్తోంది. న్యాయవ్యవస్థపై ఇలా లేఖతో దాడి చేయడం, ఆరోపణలు చేసి మీడియాకు విడుదల చేయడాన్ని ఏ ప్రధాని, హోం మంత్రి కూడా ప్రోత్సహించరు. రాజ్యాంగ వ్యవస్థ, న్యాయవ్యవస్థ విశ్వసనీయత బలంగా ఉన్న దేశానికి ఇది మంచిది కాదనే విషయం వారికి తెలియంది కాదు. కానీ.. తాము కేంద్ర పెద్దల అనుమతితోనే లేఖ రాశామన్న భావన కల్పించడానిక ఏమో ఈ ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లేఖ విడుదలకు ముందు జగన్ ప్రధాని, హోం మంత్రిని కలవడమే దీనికి సాక్ష్యమని అంటున్నారు. దీంతో ఇప్పుడు సహజంగా కేంద్ర పెద్దలపై అందరి చూపు పడుతోంది. వారు ఈ అంశంపై స్పందించాలని చాలా మంది కోరుకుంటున్నారు.

జగన్ లేఖ రాసే ముందు మోదీ, అమిత్ షాను కలిశారు కాబట్టి దీనిపై స్పందించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ వర్గాలు జగన్ రాసిన లేఖను నిందితుడు న్యాయమూర్తిపై చేసినటువంటి ఆరోపణలుగానే చూస్తున్నాయి. అయితే ఆయనకు సీఎం పదవి ఉండటంతో.. ఆ పదవిలో ఉండటానికి ఆయన అర్హుడు కాదని అంటున్నారు. ఈ సమయంలోనే ఆ లేఖ వెనుక అమిత్ షా, మోదీలు ఉన్నారన్నట్టుగా వైసీపీ తమ బలం కోసం ప్రచారం చేసుకోవడం మాత్రం వారికి ఇబ్బందికరమే. దీనిపై స్పందించాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడుతోంది. ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు నోరు మెదపలేదు. పైగా న్యాయవ్యవస్థకు మద్దతుగా కూడా మాట్లాడలేదు. దీంతో మోదీ, అమిత్ షా దీనిపై స్పందిస్తారని.. లేఖపై ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: