ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం.. మరోసారి ఎస్‌ఈసీ వర్సెస్‌ ప్రభుత్వంగా మారింది. కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌...  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని న్యాయస్థానానికి తెలిపారు. ఈసీ నిర్వహణకు కూడా నిధులు ఇవ్వడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఎన్నికలు నిర్వహించేలా ఈసీకి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది.

విచారణలో ఈసీ వాదనలు తప్పుబట్టిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. 40 లక్షల నిధులకు గాను.. ఇప్పటికే 39 లక్షలు ప్రభుత్వం విడుదల చేసిందని కోర్టుకు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరగా.. దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిర్వహణపై తమను ఎన్నికల కమిషన్ సంప్రదించాలన్నారు.

ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించాలన్న ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యాఖ్యలను.. హైకోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా? అని ప్రశ్నించింది. ఏయే చోట్ల ప్రభుత్వం సరిగ్గా సహకరించడం లేదో.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించడం లేదనే ఆరోపణ ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేయడంతో ఉత్కంఠ నెలకొంది.








మరింత సమాచారం తెలుసుకోండి: