మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు కోల్‌కతా కుప్పకూలింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరచుకోవాలంటే నెగ్గాల్సిన కీలక మ్యాచ్‌లో.. హైదరాబాదీకి నైట్‌రైడర్స్‌ దాసోహమైంది. ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు మెయిడిన్‌ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు.

ఐపీఎల్‌ రికార్డు గొప్పగా ఏమీ లేదు. ఈ సీజన్ లో ఆడింది మూడే మ్యాచ్‌లు. అతడిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ప్రత్యర్థి జట్టు కూడా ఎక్కువగా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ ఎవరి దృష్టిలో లేని ఆ బౌలర్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు. వరుసగా రెండు మెయిడెన్‌ ఓవర్లు వేశాడు. అంతేనా.. ఆ రెండు ఓవర్లలో మూడు వికెట్లు కూడా పడగొట్టి ప్రత్యర్థి నడ్డి విరిచేశాడు. ఈ సంచలన ప్రదర్శన చేసింది మన కుర్రాడు మహ్మద్‌ సిరాజే. అతడి ధాటికి  కోల్‌కతా అల్లాడిపోయింది.

గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకొని విమర్శలపాలైన యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఈ సారి మాత్రం అదిరే ప్రదర్శనతో అందరిచేతా శభాష్‌ అనిపించుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతూ అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసి అరుదైన రికార్డు సృష్టించాడు.

2017 ఐపీఎల్‌ వేలంలో 2.6 కోట్ల రూపాయలకు సన్‌రైజర్స్‌కు అమ్ముడవడం ద్వారా వెలుగులోకి వచ్చిన బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌. పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి ఎదిగి, జూనియర్‌ క్రికెట్లో సత్తా చాటిన అతడికి సన్‌రైజర్స్‌ జట్టులో చోటు దక్కింది. తొలి సీజన్లో అతను మెరుగైన ప్రదర్శనే చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 21.2 సగటుతో 10 వికెట్లు తీశాడు. టీమిండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. తర్వాతి సీజన్‌కు బెంగళూరు అతణ్ని తీసుకుంది. కానీ ఆ జట్టు తరఫున రెండు సీజన్లలో సిరాజ్‌ ఆకట్టుకోలేకపోయాడు. 20 మ్యాచ్‌లాడి 18 వికెట్లే తీశాడు. ధారాళంగా పరుగులిచ్చేడం బలహీనతగా మారిపోయింది.  

సిరాజ్‌ మీద నమ్మకముంచిన కోహ్లీ కొత్త బంతిని పంచుకునే అవకాశమిచ్చాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంచలన బౌలింగ్‌తో జట్టుకు విజయాన్నందించాడు. బంతి బంతికీ అతడి బౌలింగ్‌ పదునెక్కింది. మరింత వేగంతో, కచ్చితత్వంతో బంతులేస్తూ కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించేశాడు. 2017 తర్వాత ఐపీఎల్‌లో సిరాజ్‌ పేరు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ప్రదర్శన అతడి ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచుతుందనడంలో సందేహం లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: