దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫరీదాబాద్‌ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి‌. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్‌ మరింత ఊపందుకుంది. ఇక లవ్‌ జిహాదీ నిరోధక చట్టాలను చేసేందుకు యూపీ, హర్యానా ప్రభుత్వాలు కసరత్తు  చేస్తున్నాయి‌. మతాంతర వివాహాలను పూర్తిగా కట్టడి చేస్తామంటున్నారు.

గత నెల హర్యానా ఫరీదాబాద్‌ లో జరిగిన నికితా తోమర్ హత్య దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి‌. ఈ కేసులో ప్రధాన నిందితుడు తౌసీఫ్ ను  ఎన్ కౌంటర్ చేయాలని దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి‌. నిఖితా పేరెంట్స్‌ నిందితుడి ఇంటిముందు ఆందోళనకు దిగారు. లవ్ జిహాద్ అంటూ తమ కూతురుని పొట్టనపెట్టుకున్న ఆ నీచుడిని కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి మహిళా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి‌.

తౌసీఫ్ అనే యువకుడు నడిరోడ్డుపై నికితాను కాల్చి చంపాడు. ఈ వీడియో చూసినవారంతా అతడిని కూడా కాల్చి చంపాలని అంటున్నారు. అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మృగాలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడుతున్నారు.

మరోవైపు ఫరీదాబాద్‌ ఘటన తర్వాత దేశంలో మరోసారి లవ్‌జిహాదీపై జోరుగా చర్చ సాగుతోంది. ఉత్తర భారతంలో ఇలాంటి ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మతం పేరుతో  చేసే దారుణాలు ఉన్నా... మరికొన్ని ప్రేమోన్మాదం చేసే దాడులు కూడా ఉన్నాయి. వీటిని నిరోధించేందుకు యూపీతో పాటు హర్యానా ప్రభుత్వాలు చట్టాలు చేసే యోచనలో ఉన్నాయి‌.

ప్రేమ పేరుతో వలవేసి బలవంతపు మత మార్పిడికి పాల్పడటాన్ని లవ్‌ జిహాద్‌ అంటారు. ఇది ముమ్మాటికి తప్పే... ఎవరూ చేసినా కూడా క్షమించారాని నేరం. అయితే యూపీ, హర్యానా ప్రభుత్వాలు లవ్‌ జిహాదీ నిరోధక చట్టాలు ఏ ప్రాతిపాదికన చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. లవ్‌ జిహాదీ  పేరుతో హిందూ, ముస్లింలు పెళ్లి చేసుకోకుండా చట్టం చేస్తే.... బలవంతంగా కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

మన దేశ రాజ్యాంగం తనకు ఇష్టమైన వారిని వివాహం చేసుకునే హక్కును కల్పించింది. లౌకికదేశంగా చెప్పుకునే మనదేశంలో ఇప్పటికే వేల సంఖ్యలో ప్రేమికులు  మతాంతర వివాహాలు చేసుకున్నారు. వీటిని లవ్‌జిహాదీ అనలేం. కేవలం బలవతంగా మతం మార్చాలనే దురుద్దేశంతో వివాహం చేసుకుంటేనే నేరమవుతుంది. అసలు హిందూ, ముస్లింలు పెళ్లి చేసుకోకుండా చట్టాలు తెస్తామంటున్నాయ్‌ యూపీ,హర్యానా ప్రభుత్వాలు. న్యాయస్థానాల్లో ఈ చట్టం నిలబడుతుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.





మరింత సమాచారం తెలుసుకోండి: