గ్రేటర్ ఎన్నికల హడావుడితో భాగ్యనగరం హీటెక్కుతోంది. అన్నిపార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగారు. దీంతో ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో బీజేపీ తరఫున భారతీయ యువమోర్చా అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య ప్రచారం చేయడానికి వచ్చారు.  

ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆయనపై పోలీసులు కేసులు పెట్టారు. అనుమతి లేకుండా బహిరంగ సభలు నిర్వహించారనే కారణంగా తేజస్విపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు పెట్టిన ఘటనపై తేజస్వి వ్యంగ్యంగా స్పందించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. మీరె పెట్టగలిగినన్ని కేసులు నాపై పెట్టుకోండి. కాకపోతే ఇలా కేసులు పెట్టి నన్ను, బీజేపీ నేతలను అడ్డుకోలేరు. మాపై ఎన్ని కేసులు పెడితే బీజేపీ అంత బలంగా మారుతుంది’’ అని తేజస్వి ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తేజస్విపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. ఇలా కేసులు పెట్టి తమ పార్టీని అడ్డుకోవాలని అనుకోవడం అవివేకం అని చెప్పారు. ఇలాంటి కేసులు పార్టీని మరింత బలంగా చేస్తాయని అన్నారు. యువత తరఫున ప్రశ్నించిన తేజస్విపై కేసులు పెట్టడం నేరమని, కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని విమమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఈ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు యువత కచ్చితంగా బుద్ది చెప్పి తీరుతుందని జోస్యం చెప్పారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు యువత సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ ట్వీట్లపై టీఆర్ఎస్ నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: