
ఏపీలో యువనేతల దూకుడు పెరుగుతుంది. ఇప్పటికే అధికార వైసీపీలో యంగ్ లీడర్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వైసీపీలో యువ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువగానే ఉన్నారు. అలాగే యువ నాయకులు కూడా ఎక్కువే. అలాగే ఈ యువ నేతలు మంచి క్రేజ్ కూడా తెచ్చుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష టీడీపీలో సైతం యువ నేతల హడావిడి పెరిగింది. తిరుపతి ఉపఎన్నికలో యువ నేతలు జోరుగా ప్రచారంగా చేస్తున్నారు.
టీడీపీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువ నాయకులు తిరుపతిలో దిగిపోయారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన బండారు శ్రావణి సైతం తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. శ్రావణి ఎట్రాక్టివ్ లీడర్‌గా మారడంతో కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
ఇలా తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రావణి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో శింగనమలలో పనిచేస్తున్నారు. శ్రావణి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీలో దిగి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ అండతో శింగనమల సీటు దక్కించుకున్న శ్రావణి, వైసీపీ అభ్యర్ధి పద్మావతి చేతిలో భారీ మెజారిటీ తేడాతో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయాక చాలామంది టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ శ్రావణి అలా చేయకుండా, పార్టీ కోసం నిత్యం కష్టపడుతూనే ఉన్నారు.
ప్రతిరోజూ నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారు. అలాగే కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ రెండేళ్ల కాలంలోనే శ్రావణి మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇలా ఫాలోయింగ్ పెంచుకున్న శ్రావణి నెక్స్ట్ ఎన్నికల్లో పద్మావతికి చెక్ పెట్టాలనే చూస్తున్నారు. అయితే పద్మావతికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ క్రమంలో పద్మావతికి శ్రావణి చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో ఈ నారీమణుల మధ్య పోరు ఎలా ఉంటుందో?