జస్టిస్ ఎన్‌వీ రమణ.. కొన్ని దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు దిగ్గజం. ఇప్పటికే న్యాయ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా కీర్తి గడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. హైదరాబాద్‌లో హైకోర్టు లీగల్‌ రిపోర్టర్లతో మాట్లాడుతూ.. తన చిరకాల వాంఛను వెల్లడించారు. అదేంటో తెలుసా.. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడమేనట.

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం అంటే.. వివాదాలను పరిష్కరించే మధ్యవర్తి కేంద్రం అన్నమాట. కోర్టల చుట్టూ ఏళ్ల తరబడి తిరగకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే సంస్థ. ప్రస్తుతం ఇది సింగపూర్‌లో ఉంది. అలాంటిదే హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయాలన్నది తన కల అని జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం, సదుపాయాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో మంచి భవనం, మౌలిక వసతులు కల్పిస్తే అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించే ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు తాను కృషి చేస్తానని ఎన్‌వీ రమణ అన్నారు. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జస్టిస్ ఎన్‌వీ రమణ చర్చించారట. కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారట. కోర్టుల్లో కేసులు పేరుకుపోవడం వల్ల  వ్యాపార లావాదేవీల్లో వివాదాలు సత్వరం పరిష్కారం కావడంలేదని.. ఈ కారణంతో పలు అంతర్జాతీయ సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి విముఖత చూపుతున్నాయని ఎన్‌వీ రమణ అన్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌లో ఫార్మా, ఐటీ రంగాలు పుంజుకున్నాయని.. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయని అందువల్ల అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం అవసరం అని ఎన్‌వీ రమణ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీలకు  వివాదాలు తలెత్తితే ఆర్బిట్రేషన్‌ కోసం  సింగపూర్‌ వెళ్లాల్సి వస్తోందని.. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఉంటే.. అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు ఇక్కడికి వస్తారన్నారు. ఈ విషయం గురించి రమణ ఇప్పటికే సింగపూర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేశ్‌ మీనన్‌తో కూడా చర్చించారట. తన పదవీకాలం ముగిసేలోగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని రమణ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: