అమెరికా దేశంలో ఓ కొత్త‌వ్యాధి క‌ల‌క‌లం సృష్టిస్తోన్న‌ది. ఆ వ్యాధి ఉల్లిలో ఉండే బ్యాక్టిరియా కార‌ణంగానే వ్యాపిస్తోంద‌ని తెలుస్తోంది. అమెరికాలోని ప‌లు రాష్ట్రాలలో ఇప్ప‌టికే భారీగానే కేసులు న‌మోద‌య్యాయ‌ని అక్క‌డి అధికారులు పేర్కొన్నారు. బ్యాక్టిరియాకు ఉల్లికి సంబంధం ఉంద‌ని సెంట‌ర్స్ ఫ‌ర్ డెసీస్ అండ్ ప్ర‌వెన్ష‌న్ వెల్ల‌డించింది. ఉల్లిలోని బ్యాక్టిరియా మూలంగానే సాల్మొనెల్లొసిస్ అనే కొత్త‌ర‌కం వ్యాధి సోకుతున్న‌ద‌ని వైద్యులు ధృవీక‌రించారు. 37 రాష్ట్రాల‌లో సాల్మొనెల్లా బ్యాక్టిరియా దాదాపు 660 మందికి వ్యాపించింది అని సీడీసీ పేర్కొంది. ఇది కూడ విస్త‌రిస్తే మ‌రో క‌రోనా మాదిరిగానే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌త‌నెల సెప్టెంబ‌ర్‌లోనే ఇందుకు సంబంధించిన ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. కానీ ఏ ఆహారం ద్వారా సంభ‌విస్తుంద‌నేది అప్పుడు గుర్తించ‌లేక‌పోయారు వైద్యులు.

చిహువా, మెక్సికో నుండి ప్రొసోర్స్ అనే సంస్థ ఉల్లిగ‌డ్డ‌ల‌ను దిగిమ‌తి చేసుకుంది. అమెరికాలో ఉన్న ప‌లు రెస్టారెంట్‌ల‌కు, కిరాణ‌షాపుల‌కు ఉల్లిని స‌ర‌ఫ‌రా చేసింది. చివ‌ర‌గా ఆగ‌స్టు 27న ఉల్లిని దిగుమ‌తి చేసుకున్నారు. ఆ ఉల్లిని ఇండ్ల‌లో, రెస్టారెంట్‌ల‌లో ఉప‌యోగించార‌ని సీడీసీ వెల్ల‌డించింది.  ఉల్లినే ఈ వ్యాధి వ్యాప్తికి కార‌ణ‌మ‌ని గుర్తించారు.  ఎక్కువ‌కాలం పాటు నిలువ చేసిన ఉల్లిగ‌డ్డ‌ల‌ను వాడ‌కూడ‌ద‌ని అమెరికాలో సీడీసీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ముఖ్యంగా మూడు నెల‌లు నిలువ చేసిన ఉల్లిని అస‌లు వాడ‌కూడ‌దు అని సూచించింది. కొద్ది రోజుల పాటు ఉల్లిని వాడ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని సీడీసీ అభిప్రాయ‌ప‌డింది. జులై నుంచి ఆగ‌స్టు 27 వ‌ర‌కు దిగుమ‌తి చేసుకున్న ఉల్లిని వెన‌క్కి తీసుకునేందుకు మెక్సికో ప్రొసోర్స్ సంస్థ ముందుకు వ‌చ్చింది.

సాల్మొనెల్లా వ్యాదిగ్ర‌స్తుల్లో డ‌యేరియా, వాంతులు, జ్వ‌రం, పొట్ట‌లో నొప్పి, డీహైడ్రేష‌న్ వంటి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని సీడీసీ వివ‌రించింది. బ్యాక్టీరియా ఉన్న ఉల్లిని తిన‌డం ద్వారా ఆరుగంట‌ల నుంచి ఆరు రోజుల లోపు ఎప్పుడైనా సాల్మొనెల్లొసిస్ వ్యాధి సోకే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించింది. చాలా మందికి ఎలాంటి చికిత్స చేయ‌కుండానే వారం రోజుల్లో కోలుకుంటున్నార‌ని తెలిపింది. ఈ వ్యాధి వ్యాప్తిని గుర్తించేందుకు ఇప్ప‌టివ‌ర‌కు దిగుమ‌తి చేసుకున్న అన్ని ర‌కాల ఆహార‌ప‌దార్థాల‌ను ప‌రిక్షించిన‌ట్టు వెల్ల‌డించారు అధికారులు. అమెరికాలో 37 రాష్ట్రాల‌లో ఇది వ్యాప్తి చెందింద‌ని సీడీసీ తెలిపింది. ఎక్కువ‌గా టెక్సాస్ రాష్ట్రంలో అత్య‌ధికంగా 160 కేసులు న‌మోద‌య్యాయి. అతి త‌క్కువ‌గా మిస్సోరిలో 21 కేసులు న‌మోదైన‌ట్టు తెలిసింది.  ఈ వ్యాధి సోక‌కుండా ముంద‌స్తుగానే అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీడీసీ హెచ్చ‌రించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: