మళ్ళీ ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలో మిగిలిన పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో గురజాల నేతలు పెద్ద పరీక్ష ఎదురుకొనున్నారు. ఎందుకంటే తాజాగా నెల్లూరు కార్పొరేషన్‌కు, 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయితే ఇందులో రెండు మున్సిపాలిటీలు గురజాల నియోజకవర్గంలోనే ఉన్నాయి.

ఈ నెల 15న ఎన్నికలు జరగనుండగా, 17న ఫలితాలు రానున్నాయి. అయితే గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మున్సిపాలిటీకి గత షెడ్యూల్‌లోనే ఎన్నిక జరిగింది. అప్పుడు వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులు ఉంటే, 33 వార్డులు వైసీపీనే గెలుచుకుంది. ఎలాగో నియోజకవర్గంలో మెజారిటీ పంచాయితీలు వైసీపీనే కైవసం చేసుకుంది. అలాగే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో కూడా వైసీపీదే పైచేయి.

అయితే ఇప్పుడు గురజాలలో దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా కొన్ని ప్రాంతాలని మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా  దాచేపల్లి, గురజాలకు మున్సిపాల్టీ హోదాను కల్పించారు. అయితే ఈ మున్సిపాలిటీలని కూడా కైవసం చేసుకుని సత్తా చాటాలని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చూస్తుండగా, కనీసం ఒక మున్సిపాలిటీని అయినా కైవసం చేసుకోవాలని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు చూస్తున్నారు.


అయితే గురజాలలో టీడీపీకి కాస్త బలం ఉంది. యరపతినేని శ్రీనివాసరావుకి ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ గత ఎన్నికల్లోనే జగన్ ఇమేజ్ ముందు యరపతినేని చిత్తు అయ్యారు. కాసు చేతిలో యరపతినేని ఓటమి పాలయ్యారు. ఇక ఎమ్మెల్యే అయ్యాక కాసు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ యరపతినేనికి ఛాన్స్ లేకుండా పనిచేస్తున్నారు. యరపతినేని కూడా దూకుడుగానే ఉంటున్నారు...కాసుకు చెక్ పెట్టడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఆ ఛాన్స్ దొరకడం లేదు. మరి ఈ రెండు మున్సిపాలిటీలో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: