వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. లేకపోతే జనసేన తమకు మిత్రపక్షమని బీజేపీ పదే పదే ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది ? అలా ప్రకటిస్తున్నారంటేనే జనసేన మీద బీజేపీలోఅనుమానాలు పెరిగిపోతున్నాయా ? అనే అనుమానాలు జనాల్లో మొదలైంది. కర్నూలులో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాట్లాడుతు జనసేన తమ మిత్రపక్షమే అంటు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది తమ రెండుపార్టీలు కలిసి నిర్ణయిస్తాయన్నారు.




ఇదే వీర్రాజు ఒకపుడు తిరుపతిలో మాట్లాడుతు మిత్రపక్షాల తరపున పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్ధంటు ప్రకటించారు. అప్పట్లో పవనే సీఎం అభ్యర్ధని ప్రకటించిన వీర్రాజు తాజాగా కూర్చుని నిర్ణయించుకుంటామని చెప్పటంలో అర్ధమేంటి ? అప్పటికేదో ఉన్న 175 సీట్లలో రెండు పార్టీలకు చెరో 70 సీట్లో లేకపోతే చెరి 80 సీట్లో వచ్చేసినంతగా బిల్డప్ ఇచ్చారు. అసలు జనసేన శీలాన్ని శంకించాల్సినంత అవసరం బీజేపీకి ఏముంది ? ఏముందంటే చాలానే ఉంది.




రెండుపార్టీలు పేరుకి మిత్రపక్షాలే కానీ ఏ విషయంలోను పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో ఏ ఒక్క కార్యక్రమంలో కూడా రెండుపార్టీలు కలవలేదు. పైగా వీళ్ళ పొత్తులు ఎప్పుడైనా చిత్తయిపోయేదే అనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఇది సరిపోదన్నట్లు ఈమధ్యనే పవన్ కు చంద్రబాబునాయుడు పంపిన లవ్ ప్రపోజలొకటి. అసలే అనుమానాల కాపురం దానికి తోడు చంద్రబాబు లవ్ ప్రపోజల్. ఇంకేముంది పవన్ ఎప్పుడైనా తమను వదిలేయచ్చనే అనుమానాలు కమలనాదుల్లో పెరిగిపోతున్నట్లుంది.




అందుకనే పదే పదే అవసరం లేకపోయినా జనసేన తమ మిత్రపక్షమని పవన్ కు గుర్తుచేస్తున్నారు బీజేపీ నేతలు. కమలనాదులు ఎంతగా గుర్తుచేసినా పవన్ కు ఇష్టంలేకపోతే బలవంతపు కాపురం సాధ్యం కాదుకదా. పైగా పవన్ కూడా వ్యూహాత్మకంగా పొత్తుల గురించి ఇపుడు ఎవరు నోరిప్పద్దని చెప్పారు. పొత్తుల గురించి మాట్లాడద్దని చెప్పారే కానీ టీడీపీతో పొత్తుండదని చెప్పలేదు. పైగా ప్రస్తుతం బీజేపీనే మిత్రపక్షమన్నారు. ప్రస్తుతానికి అంటేనే అర్ధం భవిష్యత్తులో ఏమో చెప్పలేమనే అర్ధంకదా. అందుకనే పవన్ వైఖరిపై  బీజేపీ లో అనుమానం పెరిగిపోతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: