ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మెరుగైన పీఆర్సీ కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఫిట్‌ మెంట్ పై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు.. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రభుత్వంపై ఉద్యమం తీవ్రతరం చేశారు. తమతో ఇతర ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతోనూ ఉద్యోగ సంఘాల నేతలు సమాలోచనలు జరిపారు.


ఇదే సమయంలో కొందరు ఉద్యోగ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హక్కుల కోసం ఉద్యమిస్తున్న తమను ప్రభుత్వం ఏమైనా చేయొచ్చని పీఆర్సీ సాధన సమితి ముఖ్యనేత బండి శ్రీనివాసరావు కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం తమను ఏం చేసినా న్యాయం జరిగే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని బండి శ్రీనివాసరావు అన్నారు. తమ ఉద్యమం కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్యమానికి అడ్డుకాబోదని మరో నేత బొప్పరాజు అంటున్నారు.


ఉద్యోగ సంఘాలకు మద్దతుగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్‌ యూనియన్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో పీఆర్సీ సాధన సమితి కీలక నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. ఇక ముందు ముందు ఆర్టీసీ ఉద్యోగులంతా సమ్మెకు సిద్ధంగా ఉండాలని అవసరమైతే ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.


రివర్స్ పీఆర్సీపై పోరాడుతున్న తమను ప్రభుత్వం ఏమైనా చేయొచ్చని బండి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు అన్నారు. అయితే.. అలాగని తాము బెదిరేది లేదని తేల్చి చెప్పేశారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ వెనుకడుగు వేయబోమని బండి శ్రీనివాస్‌ తెలిపారు. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యమ కార్యాచరణ, సమ్మెకు ఆటంకం కలగదని మరో కార్మిక సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాల ఏర్పాటుపై ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు గురి చేయాలని చూస్తే ఘర్షణ వాతావరణం తలెత్తుతుందని ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: