విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జాతీయ రాజకీయాల్లో ప్రకాశించబోతున్నారా..?  కారు పార్టీలో జర్నీ కి పూర్తిగా రెడీ అయిన ప్రకాష్ రాజ్ కు గులాబీ దళపతి మరింత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారా..? త్వరలోనే ఆయనకు కీలక పదవి కట్టబెడతారన్న వార్తల్లో నిజమెంత..? తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో గులాబీ భవన్ లో జరుగుతున్న చర్చేంటి? సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ కొన్నేళ్లుగా రాజకీయంగాను రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019లో కర్ణాటక నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిన ప్రయత్నాలు ఆపలేదు. ఇప్పుడు ఆయన చూపు తెలంగాణ వైపు మళ్ళిందట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు.ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదే తనకు అందివచ్చిన అవకాశంగా ప్రకాష్ రాజ్ భావిస్తున్నారట. అందుకే ఆయనతో కలిసి నడిచేందుకు రెడీ అవుతున్నారట. అందుకు అనుగుణంగానే ప్రకాష్ రాజ్ కి రాజకీయంగా పెద్దపీటే కల్పించిన కేసీఆర్ ఆయనకు సముచిత స్థానం కల్పించాలని డిసైడ్ అయ్యారట. నిజానికి మొదటి నుంచి సీఎం కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ సన్నిహితంగా ఉంటున్నారు. దీంతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ కీ రోల్ పోషించాలన్న ఆలోచనతో కెసిఆర్ ద్వారా టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు నామినేట్ చేయించుకోవాలని ప్రకాష్ రాజ్ ఆలోచిస్తున్నారట. కానీ జాతీయ స్థాయిలో తనతో కలిసి నడిచేందుకు సిద్ధమైన ప్రకాష్ రాజ్ కి అంతకు మించే రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని కెసిఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రకాష్ ది పీపుల్ ఫ్రంట్ అని ప్రకటించిన కేసీఆర్ కలిసి వచ్చే వారందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్,మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సహా పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో కెసిఆర్ చర్చలు జరిపారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో సంప్రదింపులు సమన్వయం చేసే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ పేరుతో ఏర్పాటు కానున్న ఈ టీం పీపుల్స్ ఫ్రంట్ భాగస్వాములతో నిరంతరం టచ్ లో ఉండేలా ప్లాన్ చేశారట. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై నిరంతరం చర్చలు జరిపేలా ప్రాజెక్టు డిజైన్ రూపొందించారట. త్వరలో ఏర్పాటు కాబోయే జాతీయస్థాయి సమావేశాలను కూడా ఈ కమిటీ సమన్వయం చేసుకోవాలన్నది కెసిఆర్ ఆలోచనగా గులాబీ టీం చెబుతోంది. దేశ రాజకీయాల్లో గతంలోనూ చాలా కూటములు ఏర్పడిన అందులోని పార్టీల కోఆర్డినేషన్ కోసం ఒక సెంటర్ పాయింట్ అనేది ఉండేది కాదు.

 అధికారం చేపట్టడం లేదంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం మాత్రమే లక్ష్యంగా ఢిల్లీలో కూటమి భాగస్వాముల సమావేశాలు జరిగేవి. ఢిల్లీలో ఈ కమిటీకి ఓ కార్యాలయం ఏర్పాటు చేసి నిరంతరం పని చేసేలా కెసిఆర్ కసరత్తు చేస్తున్నారు. పీపుల్స్ ఫ్రంట్ కి ఓ కేరాఫ్ అడ్రస్  క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత కీలకమైన కమిటీని నిర్వహించే బాధ్యతలను ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ లకు అప్పగించనున్నారట. మరి ఈ పని పూర్తయిన తర్వాత టిఆర్ఎస్ లో ప్రకాష్ రాజ్ కి ప్లేస్ ఇస్తారా? ఢిల్లీ లో ఉంచి సేవలను వాడుకుంటారో? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: