ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణలు మారిపోయే పరిణామాలు జరుగుతున్నాయా ? జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కాపు ఉద్యమనేత ముద్రపగ పద్మనాభం కుటుంబం వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. పద్మనాభం కొడుకు గిరిబాబు అధికారపార్టీలో చేరటానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అసలు ముద్రగడనే చేరమని వైసీపీలోని ముఖ్యనేతలు అడిగారట. అయితే ఆయన సున్నితంగానే తిరస్కరించినట్లు సమాచారం.
ఇదే సమయంలో కొడుకును చేర్చుకునే అంశం చర్చకు వచ్చినపుడు సానుకూలంగానే స్పందించారట. దాంతో గిరిబాబు వైసీపీలో చేరటం ఖాయమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయించాలని ఒకవేళ అవకాశం కుదరకపోతే ఎంఎల్సీ టికెట్ ఖాయం చేయాలని అనుకుంటున్నారట. ముద్రగడకు ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ నియోజకవర్గంలో మంచిపట్టుంది. అయితే వ్యక్తిగతంగా తాను పోటీచేసినపుడు ఆయన ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఎవరితోను ఎక్కువకాలం సఖ్యతగా ఉండలేకపోవటమే ముద్రగడకు పెద్ద మైనస్ గా మారింది. సరే ఆయన వ్యక్తిగతాన్ని పక్కనపెట్టేస్తే ముద్రగడ కొడుకు వైసీపీలో చేరితే జనసేన,టీడీపీలకు ఒకరకంగా ఇబ్బందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో మెజారిటి సీట్లు సాధించి అధికారంలోకి రావాలని వైసీపీ, టీడీపీ, జనసేన అనుకుంటున్నాయి. అయితే జనసేన, టీడీపీ విడివిడిగా పోటీచేస్తే అధికారంలోకి రావటం కాదుకదా చాలా నియోజకవర్గాల్లో గెలుపు కూడా కష్టమే. అందుకనే ఏదోపద్దతిలో రెండుపార్టీలు పొత్తుపెట్టుకుంటాయని జగన్మోహన్ రెడ్డి గట్టిగా అనుమానిస్తున్నారు.
ఈ రెండుపార్టీలు పొత్తు పెట్టుకుంటే ముందు దాని ప్రభావం గోదావరి జిల్లాల్లోనే పడతుంది. అందుకనే కాపుల ఓట్లు వైసీపీ నుండి దూరం చేసుకోకూడదంటే కాపుల్లో మంచి ఇమేజున్న ముద్రగడలాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవటం చాలా అవసరమని జగన్ డిసైడ్ అయ్యారట. ఇక్కడ గమనించాల్సిందేమంటే వైసీపీలో ముద్రగడ గిరిబాబు చేరినా ముద్రగడ పద్మనాభం చేరినట్లే లెక్క. అసలే ముద్రగడకు జనసేన అధినేత పవన్ అన్నా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నా పడదు. కాబట్టి కచ్చితంగా వైసీపీ గెలుపుకోసం ముద్రగడ పనిచేస్తారని అనుకుంటున్నారు. మరీ సమీకరణలు ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి