తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ ఇటీవల అరెస్టు చేసింది. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో తనిఖీలు చేపట్టిన ఈడీ మొన్న సాయంత్రం 05.20 గంటలకు కవితకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఆమె భర్తకు సమాచారం అందించింది. కవిత అరెస్టు వార్త బయటకు రాగానే బీఆర్ఎస్ నాయకులు భారీగా కవిత నివాసం వద్దకు చేరారు.


ఈ క్రమంలో కవిత సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావులు కవిత నివాసానికి చేరుకున్నారు. అయితే ఆమె ఇంటి వద్దకు వచ్చిన న్యాయవాదులతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను ఈడీ అధికారులు అడ్డుకున్నారు. వారిని లోపలకి అనుమతించలేదు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్ది సేపటి తర్వాత కవిత న్యాయవాదులను, వీరిని లోపలకి అనుమతించారు. ఈ సందర్భంగా కవితను ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు చేయడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఈ విషయమై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆయన ఈడీ అధికారులను నిలదీయడంతో అధికారులు ఆ దృశ్యాలను వీడియో రూపంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా కూడా ఆయన కవిత అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అరెస్టు చేయబోమని ఈడీ, అధికారులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన లేఖను చూపించారు.


అయితే కవితను అరెస్టు చేసిన కొద్ది సేపటికే ఈడీ అధికారులు కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవితను అరెస్టు చేసేందుకు తాము ఆమె నివాసానికి వెళ్లిన సమయంలో కేటీఆర్ దౌర్జన్యం చేశారని ఈడీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో కేటీఆర్ ఈడీ అధికారిణి భానుప్రియా మీనాతో పాటు మరికొందిరితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తమ విధులకు అడ్డు తగిలారు అని అధికారులు కేటీఆర్ పై కేసు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: