తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరానికి అధ్యాపకుడిగా మారి ఎందరికో స్పూర్తివంతమైన పాఠాలు నేర్పుతూ తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోసం సదా పాటు పడుతూ దశాబ్దాలుగా ఆ పార్టీతో నడుస్తూ వస్తున్న సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడుకు చంద్రబాబు నాయుడు తగిన ఫలితం ఇచ్చేశారు. ఆయన కేవలం ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కోరుకుంటే ఆయనకు ఢిల్లీ పార్లమెంట్ కి వెళ్లే దారిని చూపించారు.మొత్తానికి టికెట్  దక్కింది. ఇక గెలవడం అన్నది కలిశెట్టి చేతిలో చేతలలో ఉంది. ఇదిలా ఉంటే ఎచ్చెర్ల నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ని కలిశెట్టి అప్పలనాయుడు ఆశించారు. ఆ సీటు చుట్టూనే ఆయన గత అయిదేళ్ళ నుంచి తన రాజకీయాన్ని అల్లుకున్నారు. కానీ టీడీపీ అధినాయకత్వం ఊహించని విధంగా నిర్ణయం తీసుకుంది.టీడీపీ కలిశెట్టికి విజయనగరం ఎంపీ సీటుని ఇచ్చింది. ఏకంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీద గెలవాలని పెద్ద టాస్క్ ని కూడా ఇచ్చింది. అందువల్ల కలిశెట్టికి ఇది చాలెంజ్ గా మారుతోంది. ఆయనకు ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ ఇచ్చి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కి విజయనగరం ఎంపీ సీటు ఇచ్చి ఉంటే ఇద్దరికీ కూడా న్యాయం జరిగేదని అందరు అనుకున్నారు. అలాగే చేస్తారని ప్రచారం కూడా సాగింది. కానీ ఎవరు ఊహించని విధంగా ఇపుడు ఎచ్చెర్ల సీటుని బీజేపీకి ఇచ్చేశారు.


కేవలం వేయి ఓట్లు మాత్రమే 2019 ఎన్నికల్లో వచ్చిన బీజేపీకి ఎచ్చెర్ల సీటు ఇచ్చేసి బలవంతులు అయిన ఇద్దరు నేతలను చేరో సీటుకు సర్దేసింది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం.అందువల్ల చీపురుపల్లి అసెంబ్లీ టికెట్ కళా వెంకట్రావు కి వెళ్ళింది. విజయనగరం ఎంపీ సీటు కలిశెట్టి వశం అయింది. నిజానికి ఈ సీట్ల పంపిణీతో ఈ ఇద్దరూ అంత సంతృప్తిగా లేరని అంటున్నారు. మంత్రి బొత్స మీద చివరి నిముషంలో ఫైట్ చేయడం అంటే కళా వెంకట్రావు కి కూడా పెద్ద ఫైట్ గానే ఉంటుంది.ఇంకా అక్కడ లోకల్ గా ఉన్న అసంతృప్తులు కూడా సర్దుబాటు చేసుకోవాలి. దాని కంటే ఎంపీ సీటే నయమని కళా వర్గం అంటోంది. తమ నేతకు ఉన్న అనుభవానికి పార్లమెంట్ కి పంపినా ఓకే అని వారు అంటున్నారు. అయితే విజయనగరం కీలక నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కలిశెట్టి వైపే మొగ్గు చూపారని అంటున్నారు.అందువల్ల కళాకు చీపురుపల్లి వెళ్ళక తప్పలేదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: