చంద్రబాబు మళ్లీ జైలు పాలవుతారా.. ఆయన బెయిల్‌ రద్దు అవుతుందా.. అందుకు నారా లోకేశ్‌ మెంయిటైన్‌ చేస్తున్న రెడ్‌ బుక్‌ కారణమవుతుందా.. అన్న వూహాగానాలు షికారు చేస్తున్నాయి. నిన్న సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగిన తీరు చూస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసినా.. విచారణలో జరిగిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.


ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు సాధారణ బెయిల్‌ మంజూరు చేసిందని, దాన్ని తాము సవాలు చేస్తూ... పిటిషన్‌ దాఖలు చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. స్కిల్‌ కేసులో దర్యాప్తు సంస్థ చార్జిషీట్‌ దాఖలు చేసిందని, ట్రయల్‌ కోర్టు ఇంకా దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని కోర్టుకు చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధలూథ్రా  తెలిపారు. అయితే హైకోర్టు ఉత్తర్వులను తాము సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.


మధ్యంతర ఉత్తర్వుల్లో... నోటీసులు ఇస్తూ... ర్యాలీలు, బహిరంగ సభల్లో హాజరు కావద్దు అన్న నిబంధనపై సడలింపు ఇచ్చారన్న ప్రభుత్వ న్యాయవాది.. దానికి అనుగుణంగా చంద్రబాబు ర్యాలీల్లో హాజరవుతున్నారని, ఐతే.... ఆయన కొడుకు మాత్రం దర్యాప్తు అధికారులను బెదిరించేలా మాట్లాడుతున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని చంద్రబాబు కొడుకు లోకేష్ బెదిరిస్తున్నారని... ఆ అంశం పైనే ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌- ఐఏ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు.


తాను రెడ్‌ బుక్‌లో అన్ని నమోదు చేస్తున్నా అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..  రెడ్ బుక్‌లో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రసంగాలు చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది  కోర్టుకు తెలిపారు. హైకోర్టు విధించిన బెయిల్ షరతులను చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారన్న ప్రభుత్వ న్యాయవాది ఆయన బెయిర్ రద్దు చేయాలన్నారు. అయితే.. చంద్రబాబు కొడుకు లోకేష్ మాట్లాడితే... చంద్రబాబు బెయిల్ షరతుల ఉల్లంఘన ఎలా అవుతుందని సిద్దార్ధ లూథ్రా వాదించారు. మొత్తానికి లోకేశ్‌ మరోసారి చంద్రబాబు కొంపముంచేలా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: