
ఇక లేటెస్ట్‌గా బయటకొస్తున్న టాక్ ప్రకారం, కేంద్ర క్యాబినెట్‌లో విస్తరణలో జనసేనకు ఒక బెర్త్ ఇవ్వబోతున్నారట. అదే కింద నాగబాబు కేంద్ర మంత్రిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ తరఫున రామ్మోహన్ నాయుడు (బీసీ) మరియు పెమ్మసాని చంద్రశేఖర్ (ఓసీ)కు చోటు దక్కింది. మూడో మంత్రి స్థానాన్ని రాయలసీమకు ఇచ్చి సామాజిక ప్రాతినిధ్యం నిలుపుకోవాలన్నదే బీజేపీ లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది.అయితే నాగబాబు ఎంపీ కాదనుకోండి – ఆయనకు కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే, రాజ్యసభలోకి పంపాల్సి ఉంటుంది. కానీ ఏపీలో ప్రస్తుతం రాజ్యసభ ఖాళీలు 2026లో మాత్రమే రాబోతాయి. అప్పుడు ఆయన్ను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓ సీటు నుంచి పంపాలన్న ఆలోచన ఉంది. ఈ విషయం మోదీ – చంద్రబాబు భేటీలో చర్చనీయాంశమయ్యే అవకాశముంది.
పవన్ కళ్యాణ్ తన సోదరుడికి కేంద్రంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం వెనుక వ్యూహాత్మక నిర్ణయం ఉంది. ఒకవైపు కూటమిలో సమానత సాధించాలి, మరోవైపు రాజకీయ వ్యూహాలలో కూడా బ్యాలెన్స్ ఉండాలి. దీంతో నాగబాబుకు కేంద్ర మంత్రిగా అవకాశం సీరియస్‌గా పరిశీలనలో ఉంది. కానీ చివరికి ఇది అమలయ్యేనా లేదా అనేది వర్షాకాల పార్లమెంటరీ సెషన్ తర్వాతే తేలనుంది. ఏదేమైనా – నాగబాబు మంత్రి అవుతారన్నది దాదాపు ఖాయం. రాష్ట్రమా? కేంద్రమా? అనేది తేలాల్సిన విషయమే కానీ, మెగా బ్రదర్‌కు ‘అమాత్య’ పిలుపు రావడం ఖచ్చితమే అన్నదే జనసేన వర్గాల భావన.