వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం, అరెస్టులు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుల కేసులు ఈసారి విచారణల దిశగా ముందుకు వెళ్తుండగా, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఆ లిస్టులో చేరబోతుందనే వార్తలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆయన సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, విచారణలో కీలక విషయాలు బయటపడటం... అనిల్‌కు భారీ దెబ్బలా మారే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో క్వార్జ్ మైనింగ్ అక్రమ రవాణా కేసులో అనిల్ కుమార్ యాదవ్పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.


ఈ కేసులో అనిల్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి విచారణలో, రుసుమ్ చెల్లించకుండా మైనింగ్ చేసిన వివరాలను, డంపింగ్ వివరాలను పోలీసులు వెల్లడించినట్టు సమాచారం. శ్రీకాంత్ రెడ్డి మాటల ప్రకారం, 2023 ఆగస్టు నుంచి అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్థన్ రెడ్డితో కలిసి క్వార్జ్ వ్యాపారం నిర్వహించినట్లు తెలుస్తోంది. లీజు గడువు ముగిసిన  మైనింగ్ ప్రదేశం నుంచి భారీగా క్వార్జ్ తరలించారని వెల్లడించారు. ఈ అక్రమంగా తవ్విన క్వార్జ్‌ను చైనా తరలించిన విషయాన్ని కూడా శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్టు సమాచారం. వీటిని డంప్ చేసిన ప్రదేశం, డీలింగ్ చేసిన భూమి ఒప్పందాలు, ఇచ్చిన డబ్బుల లెక్కలు అన్నీ కూడా ఈ కేసులో కీలక ఆధారాలుగా మారుతున్నాయి.


ఇందుకు సంబంధించి వాకాటి శివారెడ్డి, శశిధర్ రెడ్డి వంటి వ్యక్తుల పేర్లు కూడా విచారణలో తేలడం గమనార్హం. ఈ నేపథ్యంలో “తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్” అనే మాట రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే కాకాణి గోవర్థన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న సందర్భంలో, అనిల్‌పై త్వరలో కేసు నమోదు చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందిన నేతలపై విచారణల ఉక్కుపాదం రోజురోజుకీ బలంగా పడుతుండటంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కేసులు రాజకీయ సమీకరణాలకు, అధికారం మారిన తర్వాత విచారణల వాస్తవానికి నిదర్శనంగా మారుతున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ నిజంగా అరెస్ట్ అవుతారా? లేక ఈ దశలో విచారణ కే పరిమితమవుతుందా? అన్నది త్వరలోనే తేలనుంది.










మరింత సమాచారం తెలుసుకోండి: