
యువతకు మోదీ ప్రత్యేక పిలుపు .. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని ప్రధాని నొక్కి చెబుతూ, వారు ముందడుగు వేస్తే దేశీయ పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. “ఒక్క విదేశీ వస్తువును కూడా ఇంటికి తేవద్దు. టెక్నాలజీ, ఫ్యాషన్, గాడ్జెట్లు ఏ రంగంలోనైనా స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి” అని యువతను ఉద్దేశించి మోదీ ఆహ్వానించారు. యువత మార్పుకు చోదకశక్తిగా మారితే అది చరిత్ర సృష్టిస్తుందని స్పష్టం చేశారు. వ్యాపారులకు ఆదేశం – “స్వదేశీ మాత్రమే అమ్మండి” .. వ్యాపార వర్గాలకు కూడా మోదీ గట్టి సందేశం ఇచ్చారు. ప్రతి వ్యాపారి తన దుకాణంలో “స్వదేశీ వస్తువులే అమ్ముతాం” అనే బోర్డు పెట్టాలని సూచించారు. ఒక్కో వ్యాపారి ఇలాంటీ నిర్ణయం తీసుకుంటే అది జాతీయ ఉద్యమంలా మారుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ఫలితంగా చిన్న వ్యాపారులు, కూలి వర్గాలు, పరిశ్రమలు బలోపేతం అవుతాయని, వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
స్వదేశీ ఉద్యమం – చరిత్రలోనుంచి నేటి వరకూ .. మహాత్మా గాంధీ నేతృత్వంలో స్వాతంత్ర్య పోరాట కాలంలో జరిగిన స్వదేశీ ఉద్యమంను మోదీ మరోసారి గుర్తు చేశారు. అప్పట్లో విదేశీ వస్తువుల బహిష్కరణ బ్రిటిష్ వ్యాపారానికి గట్టి ఎదురుదెబ్బనిచ్చినట్లు, నేటి కాలంలోనూ అదే స్ఫూర్తి అవసరమని ప్రధాని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ – దేశ భవిష్యత్తుకు హామీ .. “ఆత్మనిర్భర్ భారత్ అంటే కేవలం వస్తువులు తయారు చేయడమే కాదు, అది ఒక జాతీయ దృక్పథం” అని మోదీ స్పష్టం చేశారు. మనం తయారు చేసిన ఉత్పత్తులను మనమే వినియోగిస్తే ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ కోట్లాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, ఇది దేశ భవిష్యత్తుకు బలమైన భరోసా అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్వదేశీ ఉద్యమం కేవలం ఒక నినాదం కాదని, ప్రతి భారతీయుడి జాతీయ కర్తవ్యం అని మోదీ ప్రసంగం సారాంశం .