పార్టీ బలంగా నిలవాలంటే కేవలం ఓట్లు, నాయకత్వం మాత్రమే కాదు… పార్టీ తరఫున మాట్లాడే అధికార ప్రతినిధులు కూడా అత్యంత అవసరం. మీడియాలో, ప్రజల ముందు పార్టీ విధానాలను చెప్పడమో, ప్రత్యర్థుల ఆరోపణలకు సమాధానమో చెప్పే బాధ్యత ఈ ప్రతినిధులదే. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు కీలక పార్టీలకు ప్రస్తుతం అధికార ప్రతినిధుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. జనసేన కు ప్రారంభం నుంచే అధికార ప్రతినిధుల కొరత ఉంది. పార్టీ వ్యవహారాలు నాదెండ్ల మనోహర్ భుజస్కంధాల మీదే ఉండేవి. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉండటంతో పాటు పార్టీ వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి రావడంతో ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. దీనివల్ల పార్టీ తరఫున సమయానికి స్పందించే పరిస్థితి లేకుండా పోతుంది. విశాఖలో జరిగిన సమావేశంలో ఈ సమస్యపై చర్చ జరగగా, "త్రిశూల్ వ్యూహం" పేరుతో ముగ్గురు కీలక నేతలను ఎంపిక చేసి అధికార ప్రతినిధులుగా నియమించే ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం.


బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితే. దుగ్గుబాటి పురందేశ్వరి హయాంలో నలుగురు అధికార ప్రతినిధులు ఉన్నారు. కానీ ఆమె వెళ్లిన తర్వాత ఆ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడే అన్నీ చూసుకుంటున్నట్లు ప్రచారం ఉంది. ఇది ఆయనపై భారీ భారం కావడంతో అధిష్ఠానం వద్ద అధికార ప్రతినిధులు నియమించాలని కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే, ఈ పార్టీలోనూ ప్రతినిధుల కొరత పెద్ద సమస్యగానే ఉంది. కేంద్ర అధిష్ఠానం ప్రతినిధులను నియమించినా, రాష్ట్ర చీఫ్ షర్మిలకు అవసరం లేదనే అభిప్రాయం ఉండటంతో, ఇప్పటికే నియమించబడ్డ ప్రతినిధులు సైలెంట్‌గా మారిపోయారు. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎవరు ముందుకు వచ్చి పార్టీ తరఫున మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది.


అధికార ప్రతినిధులు ఉండటం వల్ల లాభమా లేక నష్టమా? అనుభవజ్ఞులైన, నిర్మాణాత్మకంగా వ్యవహరించే ప్రతినిధులు ఉంటే అది పార్టీకే కాక ప్రజలకు కూడా మేలు చేస్తుంది. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై సరైన వివరణ ఇస్తారు. ప్రత్యర్థుల విమర్శలను సమర్థంగా ఎదుర్కొనే వేదిక అవుతారు. అందుకే ఏ పార్టీలో అయినా అధికార ప్రతినిధుల స్థానానికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ కీలక వ్యవస్థను విస్మరిస్తున్న ఏపీ పార్టీల భవిష్యత్తులో దీనివల్ల ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: