భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వినగానే ఎంతోమంది యువతకు, విద్యార్థులకు, ఉద్యోగ జీవితంలో ఎదగాలనుకునే వారికి, సమాజానికి ఉపయోగపడాలని కృషి చేసేవారికి ఒక ప్రత్యేకమైన ఇన్స్పిరేషన్‌గా నిలుస్తారు. ఆరోగ్య పరంగా, క్రమశిక్షణ పరంగా, కష్టపడి చదవడం పరంగా, జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరుకోవడం పరంగా ఆయన చూపించిన దారి అందరికీ ఒక పాఠం లాంటిది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు – వరుసగా మూడోసారి కూడా దేశ ప్రజల విశ్వాసాన్ని సంపాదించి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం నరేంద్ర మోడీ గారి అసాధారణ విజయగాథ.
 

దేశ చరిత్రలోనే ఆయన సృష్టించిన ఈ రికార్డు ఒక మైలురాయి. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలనే లక్ష్యంతో ఆయన చేపట్టిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రజలలో విశ్వాసాన్ని నింపాయి. నూతన భారత నిర్మాణమే తన జీవన లక్ష్యం అని ప్రకటించిన మోడీ గారు, ఆ దిశగా తీసుకుంటున్న వేగవంతమైన అడుగులు ప్రజలను మరింత ప్రేరేపిస్తున్నాయి. నేడు (2025 సెప్టెంబర్ 17న) ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా మాత్రమే కాక, విదేశాల్లోనూ కోట్లాది మంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలన్నీ మోడీ గారి ఫొటోలు, శుభాకాంక్షా సందేశాలతో నిండిపోయాయి. చాలా మంది ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరికొందరు ఆయన పేరుతో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు.



నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వడనగర్ పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోడీ ఒక చిన్న టీ దుకాణం నడిపేవారు. చిన్నతనంలోనే నరేంద్ర మోడీ ఆ దుకాణంలో సహాయం చేస్తూ జీవితం యొక్క కష్టసుఖాలను దగ్గరగా అనుభవించారు. చదువులో మంచి ప్రతిభ చూపినప్పటికీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆయన కలలు చాలాసార్లు నెరవేరలేకపోయాయి. మోడీ గారి చిన్ననాటి కల ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయడమే. ఇందుకోసం ఆయన జామ్‌నగర్ సైనిక్ స్కూల్‌లో చేరాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా అది సాధ్యపడలేదు. అయినప్పటికీ 1965–66 ఇండో-పాక్ యుద్ధం సమయంలో వడనగర్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణిస్తున్న భారత సైనికులకు టీ అందిస్తూ తన దేశభక్తిని చూపించారు. ఈ సంఘటన ఆయనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని ఎన్నో ఇంటర్వ్యూలలో భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.



ఆర్మీ ఆఫీసర్ కావాలనే కలను ఆర్థిక సమస్యలు అడ్డుకున్నప్పటికీ, నేడు ఆయన దేశ సైన్యాన్నే శాసించే స్థాయికి ఎదిగారు. చిన్న టీ దుకాణం వద్ద సహాయం చేసిన బాలుడు, కోట్లాది భారతీయుల ఆరాధ్య నాయకుడిగా ఎదగడం అనేది నిజంగా ఒక అద్భుతమైన ప్రేరణాత్మక జీవన గాథ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రాధాన్యం కేవలం భారతదేశ ప్రజలకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, విదేశీ నేతలు కూడా ఆయన లీడర్‌షిప్, దృఢ సంకల్పాన్ని గుర్తించి ప్రశంసిస్తున్నారు. ఆరోగ్యం, క్రమశిక్షణ, అంకితభావం, దేశాభివృద్ధి పట్ల నిబద్ధత – ఈ అన్ని అంశాలలోనూ ఆయన అందరికీ ఒక రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా కోట్లాది ప్రజలు ఒకే మాట చెబుతున్నారు – “నరేంద్ర మోడీ గారు ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా, మరెన్నో పుట్టినరోజులను జరుపుకుంటూ దేశానికి మరింత సేవ చేయాలి” అని కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: