ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లు మరోసారి రాజ్యసభలో దుమారాన్ని లేపింది. కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌ శర్మ సోమవారం సభలో బిల్లు అంశాన్ని సభలో ప్రస్తావించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా బిల్లు రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు. సభ్యుడి హక్కులను కాలరాసిందని ఆనంద్ శర్మ ధ్వజమెత్తారు.



వచ్చే శుక్రవారం రాజ్యసభలో బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అయితే బిల్లును వచ్చే శుక్రవారం చర్చించడం వీలుకాదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ బీజేపీ కావాలనే కేవీపీ ప్రైవేట్ బిల్లును అడ్డుకుంటోందన్నారు. ఆగస్టు 5న ప్రైవేటు బిల్లుపై చర్చకు అనుమతి ఇస్తామన్నారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు బిల్లుపై ఈరోజు చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు.మరోవైపు సభలో గందరగోళం నెలకొన్నా జీరో అవర్ కొనసాగింది. 



ఏఏపీ లోకసభ సభ్యుడు పార్లమెంటును వీడియో తీయడం రాజ్యసభ పరిధిలోకి రాదని, దానిని బీజేపీ రాద్దాంతం చేసిందని జైరాం రమేష్ అన్నారు. రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ ప్రజల హక్కును ఈ ప్రభుత్వం కాలరాసిందన్నారు. దీనికి కురియన్ స్పందిస్తూ... సభ ఆర్డర్‌లో లేకపోవడం వల్ల శుక్రవారం నాడు రాజ్యసభను వాయిదా వేశామని చెప్పారు. అయితే, వచ్చే శుక్రవారం నాడు కేవీపీ ప్రయివేటు మెంబర్ బిల్లు పైన చర్చకు హామీ ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం వచ్చే శుక్రవారం కాకుండా, ఆగస్టు 5వ తేదీన చేపడతామని కురియన్ చెప్పారు. వచ్చే శుక్రవారం హామీ ఇవ్వలేమన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: