త‌న వ్యాఖ్య‌లతో అశేష ఆంధ్ర‌ప్ర‌జ‌ల‌ను ఆలోచింప జేసే రాజ‌కీయ నేత‌, మాజీ ఎంపీ, ప్ర‌స్తుతం రాజ‌కీయంగా త‌ట‌స్థంగా ఉన్న ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కు వైసీపీ అధినేత‌, కాబోయే సీఎం జ‌గ‌న్ పెద్దపీట వేయ‌నున్నారా?  మేధావి వ‌ర్గాల్లో సైతం మంచి గుర్తింపు పొందిన ఉండ‌వ‌ల్లిని ఏకంగా త‌న ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుగా నియ‌మించుకునేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారా? అంటే..తాడేప‌ల్లిలోని వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌య వ‌ర్గాలు ఔన‌నే అంటున్నాయి. నిజానికి వైఎస్ కుటుంబానికి ముఖ్యంగా వైఎస్‌కు అత్యంత ఆప్తుడిగా ఉండ‌వ‌ల్లి పేరు తెచ్చుకున్నారు. 


అదే స‌మ‌యంలో 2014లో రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించి కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు. అయితే, త‌ర‌చుగా ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాలు, క‌డుతున్న ప్రాజెక్టుల‌పై త‌న‌దైన నిశిత విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ పార‌ద‌ర్శ‌కంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. పోల‌వ‌రం నిర్మాణం కానీ, అమ‌రావ‌తి నిర్మాణం కానీ, ప‌ట్టిసీమ ప్రాజెక్టుకానీ, జ‌న్మ‌భూమి క‌మిటీలు కానీ ఇలా ఏ విష‌యంలోనైనా ఉండ‌వ‌ల్లి త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. నిజానిజాలు ఇవీ! అంటూ మీడియా ముఖంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.


ప్ర‌భుత్వంతో చ‌ర్చించేందుకు కూడా తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ప్ర‌ధానంగా తెలంగాణ ప్ర‌భుత్వంతో ఏపీ ప్ర‌భుత్వం వైరం కొన‌సాగించ‌డం, కేంద్రంతో గొడ‌వ‌లు పెట్టుకోవడాన్ని తీవ్రం గా వ్య‌తిరేకించిన ఉండ‌వ‌ల్లి, అమ‌రావ‌తికి 33 వేల ఎక‌రాల భూమిని తీసుకోవడాన్ని కూడా అనేక సంద‌ర్భాల్లో త‌ప్పుప‌ట్టారు. ఇక‌, విభ‌జ‌న హామీల విష‌యంలోను, 2014కు ముందు జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌పైనా ఆయ‌న అనేక ప్ర‌శ్న‌లు సంధించారు. ఏపీకి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విష‌యంలో అనేక సూచ‌న‌లు , స‌ల‌హాల‌ను ఇచ్చారు. అవ‌స‌ర‌మైతే.. తానుకూడా ప్ర‌భుత్వంతో క‌లిసి పోరాటానికి దిగుతాన‌ని చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి.


ఈ  క్ర‌మంలోనే ఇలాంటి మేధావి త‌న‌కు అండ‌గా ఉంటే మంచిద‌ని భావించిన జ‌గ‌న్‌, ఆయ‌న‌ను రాజ‌కీయంగా కాకుండా ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుగా చేసుకుని ముందుకు క‌ద‌లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. దీనికి గాను ఇప్ప‌టికే మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం చేసుకున్న జ‌గ‌న్‌.. త‌న మిత్రుడు, రైట్ హ్యాండ్ విజయ‌సాయిరెడ్డి, పార్టీలో కీల‌క నేత‌లు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును ఉండ‌వ‌ల్లి నివాసానికి పంపి, ఆయ‌న‌ను ఆహ్వానించే ప‌నిని అప్ప‌గించార‌ని అంటున్నారు. దీనిక‌న్నా ముందు త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాల‌ని కోరుతున్నార‌ట‌. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: