1954లో గౌటెమాల దేశంలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలదోయబడటంతో మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని హింసాత్మక విప్లవ దృక్పథం మరింత బలపడింది. మెక్సికోలో ఫీడెల్ కాస్ట్రో నాయకత్వంలో అచటికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956-1959) లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్ గా, మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు.
ఈ సమయం లోనే ఇతను 'చే' గా పిలువబడ్డాడు.గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు. అలా ఆ పేరు స్థిర పడిపోయింది. ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు గెవారా పరిశ్రమల మంత్రిగా,క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే గెవారా క్యూబా సామ్యవాద దేశంగా మారటానికి దోహదపడ్డాడు.
గెరిల్లా యుద్దం గురించి వివరించే తన రచనలలో వర్థమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు. పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టిన చే 1965లో క్యూబాలో తన అతున్నత స్థానాన్ని, హోదాని, పలుకుబడిని అన్నింటిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలుడయ్యాడు. 1966 చివరిలో మరలా దక్షిణ అమెరికా చేరి బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు. ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యం చేతికి చిక్కి 1967 అక్టోబర్ 9 న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో హత్యకు గురయ్యాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి