IPL 2025 ప్లేఆఫ్స్ రేసులో RCB ఫ్యాన్స్‌కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. KKRతో జరగాల్సిన మ్యాచ్ వర్షంతో కొట్టుకుపోయినా, RCBకి తాత్కాలికంగా ప్లస్ అయినా... అసలు కథ ముందుంది. ఆ మిగిలిన రెండు మ్యాచ్‌లే ఇప్పుడు RCB తలరాతను తేల్చేవి. వాటి వివరంగా చూసేద్దాం.

ఐపీఎల్ 2025 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది, ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఫైట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అయితే, ఈ మధ్య వరుణుడు పెద్ద స్కెచ్చే వేశాడు. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్‌... కుండపోత వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క బంతి కూడా పడకుండానే అంపైర్లు చేతులెత్తేశారు.

ఈ ఊహించని పరిణామం పాయింట్ల పట్టికలో, ఇరు జట్ల ప్లేఆఫ్ ఆశలపై పెను ప్రభావమే చూపింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దవ్వడం RCBకి మేలు చేసిందనే చెప్పాలి. వాళ్ల ఖాతాలో ఒక పాయింట్ చేరడంతో, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. RCBకి ఇంకా రెండు మ్యాచ్‌లున్నాయి, మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో అది తలపడనుంది. ఈ రెండింట్లో ఒక్కటి గెలిస్తే ప్లేఆఫ్స్‌లో బెర్త్ ఖాయం చేసుకోవచ్చు.

కానీ, ఒకవేళ ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడితే పరిస్థితి ఏంటి? అప్పుడు మిగతా జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్‌లు కీలకంగా మారతాయి. అప్పుడు "ఈ సాలా కప్ నమ్‌దే" నినాదం కాస్తా "వచ్చే సాలా చూద్దాంలే" అయ్యే ప్రమాదం పొంచి ఉంది. టాప్-2లో నిలిచి, క్వాలిఫయర్-1 ద్వారా ఫైనల్‌కు వెళ్లేందుకు అదనపు అవకాశం దక్కించుకోవాలన్నది వారి తదుపరి లక్ష్యం. అందుకే, ప్రతీ మ్యాచ్, ప్రతీ పాయింట్ ఇప్పుడు అత్యంత కీలకం.

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మాత్రం ఈ వర్షం దెబ్బ గట్టిగానే తగిలింది. వాళ్ల ప్లేఆఫ్ ఆశలు దాదాపు అడియాసలైనట్టే. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉన్నారు. చివరి మ్యాచ్ గెలిచినా, గరిష్టంగా 14 పాయింట్లకు చేరుకుంటారు. అది ప్లేఆఫ్స్‌కు సరిపోతుందో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే, ఇతర జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతూ ఎక్కువ పాయింట్లు లేదా మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) సాధించే అవకాశం ఉంది.

ఐపీఎల్ చరిత్రలో వర్షం వల్ల మ్యాచ్‌లు రద్దవడం అరుదే. కానీ, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం మాత్రం వర్ష ప్రభావిత మ్యాచ్‌లకు కాస్త కేరాఫ్ అడ్రస్ లాంటిది. ఇప్పటివరకు ఈ వేదికపై ఏకంగా ఏడు మ్యాచ్‌లు పూర్తిగా వర్షార్పణమయ్యాయి. చివరిసారిగా 2019లో RCB, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇలాగే రద్దయింది.

ఈ సీజన్‌లో కూడా ఇంతకుముందు ఇదే మైదానంలో ఓ మ్యాచ్‌ను వర్షం కుదించింది. RCB, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను 14 ఓవర్లకు తగ్గించగా, ఆ మ్యాచ్‌లో RCB ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ ప్లేఆఫ్స్‌కు చేరువవుతున్న తరుణంలో, రేసులో నిలిచిన ప్రతీ జట్టుకు ప్రతీ మ్యాచ్, ప్రతీ విజయం, ప్రతీ పాయింట్ అత్యంత కీలకం కానుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: