జియో నుండి ఎదురుకానున్న సవాల్ ను ఎదుర్కొనేందుకుగాను దేశీయ టెలికాం కంపెనీలు ఐడియా, వోడాఫోన్ లు ఒకటైన సంగతి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ జియో గ‌ట్టి పోటీ ఇవ్వ‌డంతో రెండేళ్లుగా వొడాఫోన్-ఐడియా వినియోగదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక ఇటీవ‌ల ఏజీఆర్‌  వివాదంలో టెలికాం సంస్థ వోడాఫోన్‌ ఐడియా చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. టెలికాం కంపెనీలు కట్టాల్సిన బకాయిలపై సుప్రీం కోర్టు నిన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో మేము ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోకుంటే.. ఎలా అంటూ టెలికాం రంగంపై మండిపడింది. దీంతో అవాక్కయిన టెలికాం విభాగం రాత్రికి రాత్రే కట్టాలని నోటీసులు జారీ చేసింది. 

 

ఈ నేపధ్యంలో వోడాఫోన్‌ ఐడియా ఆ కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) సంబంధిత బకాయిలను రాబోయే కొద్ది రోజుల్లో టెలీకమ్యూనికేషన్ విభాగానికి (డాట్‌) జమ చేయనున్నట్లు వోడాఫోన్ ఐడియా శనివారం తెలిపింది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారాన్ని అందించింది.  ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం,  డాట్‌ విధించిన డెడ్‌లైన్‌ నేపథ్యంలో  వోడాఫోన్‌  ఐడియా  ఈ నిర్ణయం తీసుకుంది. 

 

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై ఏర్పడ్డ సంక్షోభం నేపథ్యంలో కంపెనీ బోర్డు  ప్రత్యేకంగా సమావేశ మైంది. కాగా, టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో విలీనం తరువాత అతిపెద్ద సంస్థగా అవతరించిన వోడాఫోన్‌ ఇండియా భారీ అప్పుల్లో కూరుకుపోయింది. దీనికితోడు కస్టమర్ల సంఖ్య కూడా క్రమేపీ క్షీణిస్తోంది. దీనికి ఏజీఆర్‌ బకాయిల  అంశం అగ్నికి ఆజ్యంలా తోడైంది. ఈ నేపథ్యంలోనే తమకు  ఉపశమనం కల్పించకపోతే  కంపెనీనీ మూసుకోవాల్సి వస్తుందని ఇటీవల వ్యాఖ్యానించింది. దీంతో దివాలా తీస్తున్న టెలికాం కంపెనీల జాబితాలో వోడాఫోన్, ఐడియా చేరే సూచనలు క‌నిపిస్తున్నాయంటూ చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: