జీవితం ఎలా ఉంటుందంటే...అన్నీ మనకు దక్కినట్టే ఉంటాయి. కానీ ఏదో ఒక కారణం చేత అవి మనకు దూరమవుతూ ఉంటాయి. ఏదైనా ఒక పనిని మనము సాధించాలంటే అది మరొకరితో ముడిపడి ఉంటుంది. అది మీ కుటుంబసభ్యులు కావొచ్చు లేదా, మీ సహోద్యోగి కావొచ్చు లేదా మీ స్నేహితుడు కావొచ్చు. కొన్ని సమయాలలో ఎవ్వరూ మీకు తోడుగా ఉండరు కానీ ఒక్క స్నేహితుడు మాత్రమే మీ కష్టాలలో మీ ఇష్టాలలో సుఖాలలో పాలు పంచుకుంటారు. అయితే సంపాదన గర్వం ఎప్పుడూ ఉండకూడదు. ఇప్పుడు అదే గర్వం ఉన్న ఒక స్నేహితుడి కథే ఇది.

రాజు మరియు అశోక్ ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ లక్ష్యాన్ని ఎంచుకున్నారు. దానిని సాధించడం కొరకు ఒక పది సంవత్సరాల సమయాన్ని కేటాయించుకున్నారు. అయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే రోజుకి నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకోవాలి. ఇలా శ్రమించినా కూడా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోతాడు రాజు. దీనితో చేసేదేమీ లేక ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు రాజు. అయినా కూడా తాను అనుకున్న లక్ష్యానికి వ్యాపారంలో వస్తున్న లాభాలకు పొంతనే లేకుండా పోయింది. ఇంకా సగభాగం కూడా పూర్తి కాలేదు. అయితే మరోవైపు అశోక్ మాత్రం తాను వేసుకున్న ప్లాన్ ప్రకారం తన లక్ష్యాన్ని సాధించి ఇప్పుడు మంచి స్థాయిలో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.

కొంతకాలం తరువాత వీరిద్దరూ కలుసుకున్నారు. వారి లక్ష్యాల గురించి చర్చించడం మొదలెట్టారు. అశోక్ తన గురించి చెబుతూ నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని, కానీ నువ్వు మాత్రం ఇదే విధంగా కొనసాగితే జీవితంలో ఏమీ సాధించలేవని హితవు పలికాడు. పైగా తాను సాధించిన దానితో పోలుస్తూ గొప్పలు పోయాడు. ఈ విధంగా జరిగినందుకు రాజు చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు. మళ్ళీ కొంతకాలం తరువాత రాజు మరి కొన్ని ఆలోచనలతో తన వ్యాపారాన్ని వృద్ధి చేసి మంచిగా లాభాలను గడించాడు. అశోక్ మాత్రం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీ దివాళా తీయడంతో తీవ్ర కష్టాలో కూరుకుపోయాడు.

అదే విధంగా మళ్ళీ వీరిద్దరూ కలిశారు. ఈసారి అశోక్ జరిగిన నష్టం గురించి చెప్పడానికి సందేహిస్తూ ఉన్నాడు. రాజు జరిగినదాని గురించి ఊహించి అశోక్ తో ఇలా అన్నాడు...ఒరేయ్ అశోక్ నువ్వేమి బాధపడకు నీకేమైనా సహాయం కావాలంటే నేను చేస్తాను..అంతే కానీ అలా బాధపడకురా అని ఓదార్చాడు. జరిగిన తప్పును గ్రహించిన అశోక్ కన్నీళ్లపర్యంతం అయ్యాడు. చూశారా సంపాదన గర్వంతో రాజుని అవమానించినా తట్టుకుని, ఇప్పుడు రాజు సంపాదనలో తనకన్నా గొప్ప స్థాయిలో ఉన్నా అశోక్ తో ఎలా ప్రవర్తించాడో...అందుకే పెద్దలు చెబుతారు. "ఎంత ఎత్తుకు ఎదుగుతావో అంత ఒదిగి ఉండాలని"...!

మరింత సమాచారం తెలుసుకోండి: