మనకు జీవితాన్ని ఇచ్చేది తల్లి తండ్రులు. అమ్మ నవమాసాలు మోసి మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే, నాన్న మనకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ముందుండి నడిపిస్తాడు. అమ్మ గోరు ముద్దులతో, తియ్యటి మాటలతో తన ప్రేమను కురిపిస్తే, తండ్రి బిడ్డలపై ఉన్న తన బాధ్యతను నెరవేరుస్తూ తన ప్రేమను వ్యక్తీకరిస్తాడు. మనసులో అపారమైన ప్రేమ దాగి ఉన్న బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పైకి మాత్రం కాస్త కఠినంగా కనిపిస్తాడు తండ్రి. పిల్లలను తల్లి తండ్రులు చూసినట్లు, ప్రేమించినట్లు ప్రపంచంలో మరవ్వరూ ప్రేమించరు ప్రేమించలేరు కూడా. కానీ ఈ విషయాన్ని ఇప్పటికీ చాలా మంది యువత గుర్తించలేకపోతోంది.

చాలా మంది ఈ రోజుల్లో నాన్న విషయములో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు.  పైకి కనిపించే తండ్రి కోపాన్ని చూసి బాధపడుతున్నారే తప్ప, ఆ కోపం వెనక దాగి ఉన్న బాధ్యతను గుర్తించలేకపోతున్నారు. దీని వల్ల వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వకపోవడం, తండ్రి చెప్పిన దారిలో నడవకుండా ఆయన చెప్పిన మాట నేనెందుకు వినాలి అనుకోవడం, మరికొందరు పిల్లలు  వారిపై కోపాన్ని పెంచుకోవడం చేస్తుంటారు.  కానీ ఇది సరైనది కాదు, పిల్లలు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు, అర్దం చేసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. తప్పు చేసినపుడు మనల్ని తండ్రి దండించకుండా గారాబం చేస్తే...అప్పుడు ఆ  పిల్లలు ఆ  తప్పును మళ్లీ చేయడానికి ఆస్కారం దొరుకుతుంది.

అలా కాకుండా మొదట్లోనే తండ్రి గట్టిగా మందలిస్తే పిల్లలు నయానో, భయానో తిరిగి తప్పులు చేయడానికి వెనకాడుతారు. వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ పిల్లలు తండ్రి ఉద్దేశ్యాన్ని అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన భవిష్యత్తు గురించి ఆయన పడే తపనను గుర్తించగలిగితే తండ్రి యొక్క విలువ తెలిసొస్తుంది. ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా తన జీవితాన్ని మొత్తం మనకోసం దారబోసేవాడే తండ్రి. తల్లితండ్రులు మరియు పిల్లల మధ్య ఉండే అనుభందం ఎన్నటికీ చెరిగిపోనిది. ఈ ప్రపంచంలో మిగిలిన ఏ బంధంలో అయినా స్వార్థం ఉంటుందేమోగానీ, పిల్లలపై తల్లితండ్రులు చూపించే ప్రేమలో మాత్రం రవ్వంతైన స్వార్థం కనిపించదు. అదే స్వఛ్చమైన ప్రేమ. తల్లితండ్రుల ప్రేమను గుర్తించి ఆస్వాదిస్తూ ఆనందించండి. హ్యాపీ ఫాదర్స్ డే.

మరింత సమాచారం తెలుసుకోండి: