హిజ్రా అనగానే సమాజం ఏ విధంగా వారి పట్ల ప్రవర్తిస్తుందో, వారిని ఏ విధంగా చిన్న చూపు చూస్తుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హిజ్రాలందరూ భిక్షాటన చేస్తూనే జీవనం గడుపుతారని అందరూ అనుకుంటుంటారు. కానీ.. అది పొరపాటు. లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాను ఒక్కసారి గుర్తుచేసుకుంటే సమాజంతో పాటు కన్నవారు కూడా ఓ హిజ్రాను గెంటేస్తారు. అయినప్పటికి మరో హిజ్రాను వైద్యురాలిని చేయడం ద్వారా తన కలను నిజం చేసుకోవాలని అనుకుంటుంది.

కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన వీఎస్ ప్రియ అనే హిజ్రా కథ కూడా సరిగ్గా కాంచన కథలాగే ఉంటుంది. కాంచన సినిమాకు ప్రియ కథకు తేడా ఏంటంటే.. ప్రియ తల్లిదండ్రులు ఆమెను గెంటేయలేదు. ఆమెను అర్థం చేసుకుని.. అతడు ఆమెగా మారేందుకు అంగీకరించారు. ప్రియ హిజ్రాగా ఎలా మారిందంటే.. ప్రియ శారీరకంగా ఎదుర్కొనే సమస్యల గురించి ముందుగా తన తల్లిదండ్రులకు చెప్పగానే మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. ప్రియకు ఎలాంటి మానసిక సమస్య లేదని వైద్యుడు చెప్పాడు. దీంతో ప్రియ శారీరక బాధను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. మరో విశేషమేంటంటే.. ప్రియ తల్లిదండ్రులిద్దరూ నర్సింగ్ వృత్తిలో ఉన్నారు. ఈ కారణంగా తమ పిల్లలు కూడా వైద్యులు కావాలని వారు కలలు కన్నారు. వారు కలలు కన్నట్టుగానే ప్రియ సోదరుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు.

ప్రియ కూడా తన తల్లిదండ్రుల కోరికను నెరవేర్చేందుకు వైద్యరత్నం ఆయుర్వేద కళాశాల‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద పూర్తి చేసింది. ప్రియ హిజ్రాగా మారకముందు ఆమె పేరు శశిధరణ్. వైద్యవృత్తిలో కొనసాగుతున్నప్పటికి ఆపరేషన్ చేయించుకోకపోవడంతో శశిధరణ్‌గానే పిలిపించుకుంటూ వచ్చింది. అనంతరం ఆపరేషన్ చేయించుకున్న తరువాత తన పేరును శశిధరణ్ నుంచి ప్రియగా మార్చుకుంది. తాను పనిచేస్తున్న ఆసుపత్రి యాజమాన్యం కూడా తాను హిజ్రాగా మారడం పట్ల విముఖత చూపించలేదని.. తనకు అండగా నిలిచారని ప్రియ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: