జైపూర్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వచ్చిన తరువాత ప్రముఖులతో కూడా నేరుగా మాట్లాడే అవకాశం వచ్చేసింది. సినిమా నటుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంటారు. ఈ ప్లాట్‌ఫామ్‌లలో తమ అభిమానులు, ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబిస్తూంటారు. సోనూసూద్ వంటి వ్యక్తులైతే ఏకంగా సోషల్ మీడియా ద్వారానే అనేక మంది ఇబ్బందులను కూడా తీర్చుతున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే రాజస్థాన్‌కు చెందిన అన్షూ అనే యువతి తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేసింది.

ఆ మెసేజ్‌లో తనకు హిమాచల్‌కు చెందిన టోపీ కావాలంటూ అడిగింది. ఇటీవల రాజ్ నాథ్ సింగ్ హిమాచల్‌కు చెందిన టోపీని ధరించారు. ఈ ఫొటోను చూసిన తర్వతే అన్షూ ఈ మెసేజ్ చేసింది. అయితే ఈ మెసేజ్‌కు రాజ్ నాథ్ సింగ్ స్పందించకపోయినా.. హిమాచల్ ప్రదేశ్ సీఎం కార్యాలయం స్పందించింది. అన్షూ తమ రాష్ట్రానికి చెందిన టోపీ కావాలని అడగడంతో.. సీఎం కార్యాలయం వెంటనే అన్షూ సొంత రాష్ట్రమైన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించింది. ఐటీ విభాగానికి చెందిన కిశోర్ శర్మ అనే అధికారి జైపూర్‌లోని అన్షూకు ఫోన్ చేశారు.

తాను అడిగిన టోపీని ఇచ్చేందుకు సిద్దమైనట్టు చెప్పారు. దీంతో అన్షూ ఒక్కసారిగా షాకైంది. అనంతరం అన్షూ అడ్రస్‌కు హిమాచల్ టోపీ అందింది. దీంతో అన్షూ ఆనందం వ్యక్తం చేసింది. ఆ టోపీని ధరించి సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం కార్యాలయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ‘జయరామ్ ఠాకుర్ సార్... నిజంగా మీరు మహనీయుడు. మా నాన్న చనిపోయిన తరువాత తొలిసారి నాకు కావల్సిన వస్తువు నాకు లభించింది. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ అన్షూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: